Sonia Gandhi : సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం

by Hajipasha |
Sonia Gandhi : సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలోని బెళగావిలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాలకు దూరమయ్యారు. సోనియా చికిత్స పొందుతున్నందున.. ఆమెతో ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) ఉన్నారు. సోనియా కోలుకున్న తర్వాత ప్రియాంక కూడా ఈ సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. ఇక సీడబ్ల్యూసీ సమావేశాలకు(CWC meeting) రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈసారి సీడబ్ల్యూసీ సమావేశాలకు "నవ సత్యాగ్రహ బైఠక్" అని పేరు పెట్టారు. గురువారం మధ్యాహ్నం బెళగావిలోని మహాత్మాగాంధీ నగర్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఎగురవేసి ఈ సమావేశాలను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్" ర్యాలీ నిర్వహిస్తారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శులు, మాజీ ముఖ్యమంత్రులు వంటి ప్రముఖులు పాల్గొంటారు. మొత్తం మీద 200 మంది కీలక నాయకులు ఈ భేటీలో పాల్గొంటారని ఏఐసీసీ ప్రకటించింది. ఈసారి సీడబ్ల్యూసీ సమావేశాల్లో రెండు కీలక తీర్మానాలను ఆమోదించడంతో పాటు వచ్చే ఏడాదిలో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా డిస్కస్ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed