- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదువు ప్రాముఖ్యతను తెలిపిన పొలిటికల్ డ్రామా.. 'దస్వి'
దిశ, వెబ్‌డెస్క్: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ నేర జీవితానికి అలవాటుపడిన వ్యక్తి రాత్రికి రాత్రే తనను తాను మార్చుకోగలుగుతాడా.. ఉపాధ్యాయ పోస్టుల కుంభకోణంలో చట్టానికి చిక్కి జైలుపాలైన ఆ సీఎం జైలు జీవితంలోనూ అధికార సౌఖ్యాలను పొందే క్రమంలో ఒక స్ట్రిక్ట్ పోలీస్ అధికారిణి కంట్రోల్ లోకి వెళ్లి ఆమె విధించే క్రమశిక్షణను తప్పించుకునే క్రమంలో పదో తరగతి పరీక్షకు కూర్చుంటాడా.. జైలు సూపరింటెండెంట్ విధించిన నిబంధనలను పాటిస్తూ మాజీ సీఎం నిజంగానే పరివర్తన చెందుతాడా అనే ఇతివృత్తంతో హాస్యప్రధానంగా తీసిన సినిమా దస్వీ.
దస్వీ అంటే హిందీలో 10వ తరగతి అని అర్థం. టీచర్ పోస్టుల నియామకం కుంభకోణంలో చిక్కుకుని జైలుపాలైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా పాత్రను పోలిన పాత్రలో అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ నటించిన సినిమానే దస్వీ. ఎనిమిదో తరగతి మాత్రమే చదువుకుని ఒక రాష్ట్రానికే సీఎంగా మారి అక్కడా అడ్డదిడ్డంగా వ్యవహరించి జైలుపాలై.. జైల్లో పని తప్పించుకునేందుకు, పదో తరగతి పరీక్షకు కూర్చోవడానికి గంగారాం చౌదరి పడిన పాట్లు, జైలులో అతడిలో నిజమైన మార్పుకోసం పరీక్షలు పెట్టిన జైలు సూపరింటెండెంట్, అనూహ్యంగా జైలుకెళ్లిన సీఎం భార్య స్థానం నుంచి ఆయాచితంగా కొత్త ముఖ్యమంత్రి పాత్రలో ప్రవేశించి అధికారానికి ఉన్న పవర్ ఏమిటో అతికొద్ది కాలంలోనే తెలుసుకుని పర్మనెంటుగా సీఎం పోస్టులో తిష్టవేయాలని నిమ్రత్ కౌర్ పన్నిన పథకాల చుట్టూ తిరిగిన సినిమా దస్వీ.
దస్వీ కథా పరిచయం
ఉత్తరాది రాజకీయ వాసనలు కొట్టొచ్చినట్లు కనిపించే దస్వీ సినిమా ఎలాంటి మసాలాలు లేని ఫక్తు ఓటీటీ చిత్రం. ఉత్తరభారత దేశంలో హరిత ప్రదేశ్ అనే కల్పిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి గంగారామ్ చౌదరి (అభిషేక్ బచ్చన్). జాట్ తెగకు చెందిన ఇతడు 8వ తరగతి మాత్రమే చదివిన నిరక్షరాస్యుడు. మన దేశంలో చదువుకు, రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి రాజకీయనేతగా మారి అవినీతి మధ్యలోనే బతుకుతూ సీఎం పదవిని చలాయిస్తూ ఉంటాడు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కుంభకోణంలో చట్టానికి దొరికిపోతాడు. నేరం రుజువై జైలు శిక్ష పడుతుంది. మనవి వారసత్వ రాజకీయాలే కాబట్టి, జనం వాటిని ఆమోదిస్తున్నారు కాబట్టి తన భార్య విమలాదేవి (నిమ్రత్ కౌర్)ని సీఎంగా ప్రకటిస్తాడు గంగారామ్ చౌదరి. ఇక జైలు జీవితం. జైల్లోనూ రాజకీయ నేతలకు భయపడేవారు, వారి మెప్పుకోరేవారే అధికారులుగా ఉంటారు కాబట్టి వారి సాయంతో వీఐపీ సౌకర్యాలు పొందుతూ హాయిగా గడిపేస్తుంటాడు మాజీ సీఎం గంగారాం.
అదే సమయంలో ఆ జైలుకు స్ట్రిక్ట్ సూపరింటెండెంట్‌గా వచ్చిన జ్యోతి దేశ్వాల్ (యామీ గౌతమ్) గంగారాం చౌదరి ఆటలకు అడ్డుకట్ట వేయడమే కాదు.. మిగతా ఖైదీల్లాగానే వ్యవహరించాలని హెచ్చరించి, అదనపు సౌకర్యాలు కట్ చేయిస్తుంది జ్యోతి. సాధారణ ఖైదీల్లాగే జైల్లో పని చేయాలని చెబుతుంది. 8వ తరగతి మాత్రమే చదివిన నిరక్షరాస్యుడిగా అతడిని హేళన చేస్తుంది. కాగా, జైలులో పని తప్పించుకోవడానికి పదో తరగతి చదవాలని పథకమేస్తాడు గంగారాం. అతడి ఉద్దేశాన్ని గమనించిన జైలు సూపర్నెంట్.. పదవ తరగతి ఫెయిలయితే మళ్లీ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడొద్దని షరతు విధిస్తుంది. ఆ ప్రకారమే పదోతరగతి పరీక్షలకు సన్నద్ధమవుతాడు గంగారాం. మరి తాను పదోతరగతి పరీక్ష రాశాడా, తనకు ఎవరు సాయపడ్డారు, పదో తరగతి పూర్తి చేయకుండా తనను ఎవరు అడ్డుకున్నారు, చివరకు గంగారామ్ చౌదరి తన గురించి తాను తెలుసుకున్నదేమిటి, పది పాసయ్యాక ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు అనేది దస్వీ సినిమా కథ.
విద్యా ప్రధాన సినిమా కామెడీకి పట్టం గట్టిందా..?
భారతీయ సినీ పరిశ్రమలో చదువు నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. చదువు ప్రాధాన్యతను చెప్పడానికి ప్రయత్నించిన సినిమా దస్వీ. చదువుకు, రాజకీయాలకు ముడిపెట్టి వ్యంగ్య హాస్య చిత్రంగా దస్వీని తెరకెక్కించారు డైరెక్టర్ తుషార్ జలోటా. ఈ మధ్య రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఒక వేలంవెర్రిగా, ఫ్యాషన్‌గా మారిన గ్రీన్ చాలెంజ్, ఫిట్ చాలెంజ్ వంటి చాలెంజ్‌లను రాజకీయ నేతలు ఎలా తీసుకుంటారో వ్యంగ్యంగా చూపిస్తూ సినిమా మొదలవుతుంది. అత్యంత అవినీతిపరుడైన సీఎంగా పేరొందిన హరిత ప్రదేశ్ ముఖ్యమంత్రి టీచర్ పోస్టుల భర్తీలో కుంభకోణం ఎలా చేశాడో వివరించకుండా నేరుగా నేరం చేసినట్లు ప్రకటించి జైలుకు పంపుతుంది న్యాయస్థానం. జైల్లో మాజీ సీఎంకైనా కష్టాలుంటాయి కదా. వాటిని పూర్తిగా కామెడీ రూపంలో చెప్పడంతో కథలో పటుత్వం లోపించి కామెడీ కోణమే మిగిలిందా అనే సందేహం వస్తుంది కూడా. అదే సమయంలో రాజకీయ నేతలు జైలులో ఉండి కూడా తమ పనులు బంధువులతో ఎలా చేయించుకోగలరో దస్వీ చూపుతుంది.
చదువుకున్న ప్రాధాన్యతను నెల్సన్ మండేలా సూక్తి సాక్షిగా చెప్పాలని డైరెక్టర్ అల్లుకున్న కథే దస్వీ. జైల్లో సూపర్నెంట్ జ్యోతి దేశ్వాల్ ఆంక్షలు, నువ్వు చదువుకోలేదని ప్రతిసారీ గుర్తు చేసే ఆమె మాటలు, రూల్ ప్రకారం జైల్లో అందరూ పనిచేయవలసిందే అని ఆదేశిస్తూనే విద్య, విజ్ఞానం అనేవి అతిపెద్ద జ్ఞానసాధనం కాబట్టి జైల్లో అయినా చదువుకో అంటూ ఆమె చెప్పిన మాటలు మాజీ సీఎంను ప్రభావితం చేస్తాయి. ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి వయసుతో పనిలేదు. విజయం సాధించాలంటే ఆలస్యంగానైనా సరే ఎక్కడో ఒకచోట ప్రారంభించాల్సిందే, అది ఇబ్బందిపెట్టినా, సవాలు చేసినా సరే ఆ పని మొదలెట్టాల్సిందే అనే భావనను డైరెక్టర్ బలంగా దస్వీలో చెప్పాలనుకున్నాడు. రెండుగంటల పాటు సాగే దస్వీ సినిమా సారాంశం ఇదే.
దర్శకుడు తుషార్ జలోటా తపనను తప్పుపట్టలేం, కథకు తానెన్నుకున్న పాత్రధారుల నటన కూడా తీసిపోలేదు. హర్యానా జాట్ కమ్యూనిటీ మాట్లాడే యాసను పలికించడంంలో గంగారాం (అభిషేక్ బచ్చన్), తన భార్య విమలాదేవి (నమ్రతా కౌర్), జైలు సూపర్నెంట్ జ్యోతి దేశ్వాల్ (యామీ గౌతమ్ ధర్) పడిన కష్టం సినిమా మొత్తంలో కనబడుతుంది. కానీ కథ అల్లిన విధం, స్టోరీ టెల్లింగ్ అనేవి క్యారికేచర్ తరహాలో నడవడంతో, సీరియస్ కంటెంట్ స్థానంలో హాస్యానికి మరీ ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడంతో దస్వీకి శక్తివంతమైన చిత్రణను ఇవ్వలేకపోయారు. భారీ డైలాగులు లేకపోవడం, మంచి డైలాగులతో తీర్చిదిద్దడం అన్నీ మంచి లక్షణాలే ఉన్నా పాత్రలకు నిర్బంధ హాస్యాన్ని జోడించడంతో కథ టెంపో బలహీనంగా మారింది. దస్వీలో ప్రధాన లోపం ఇదే.
అంతకుమించి ఎవరి అజెండా ప్రకారం వారు తమ తమ ఆటలను ఆడుతుండటమే సినిమాలో ప్రధాన భాగం. కానీ దీన్ని కూడా సీన్ తర్వాత సీన్‌గా చెప్పుకుంటూ పోయారే తప్ప వినోదాన్ని తారాస్థాయికి తీసుకోవడంలో డైరెక్టర్ వెనకబడినట్లు కనిపిస్తుంది. హృదయాన్ని తాకే దృశ్యాలు, కదిలించే ఘటనలు సినిమాలో చాలా చోట్ల కనిపించినా పాత్రల రూపకల్పనను సమర్థంగా వర్ణించలేదనిపిస్తుంది. ఒక అవినీతిపరుడైన రాజకీయనేతకు శిక్ష పడినప్పటికీ జైల్లో ఖచ్చితంగా ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయన్నది వాస్తవం. మామూలు బ్యారక్‌లలో రాజకీయ నేతలను పెట్టడం మన వ్యవస్థలో అసాధ్యం. పైగా జైలు సూపర్నెంట్ చెప్పగానే మాజీ సీఎం మామూలు బ్యారక్‌లోకి వెళ్లిపోవడం ప్రేక్షకుడికి నమ్మశక్యం కాదు. ఆ తర్వాత అవినీతి పరుడైన రాజకీయ నేతలో ఉన్నట్లుండి అంత పరివర్తన ఎలా వచ్చిందన్నది కూడా నాటకీయంగానే చిత్రించారు. పైగా సినిమా చూస్తున్నప్పుడు లగే రహో మున్నా భాయ్, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్ వంటి క్లాసిక్ సినిమాలను, శ్రీదేవి నటించిన చివరి సినిమాల్లో ఒకటైన హిందీ మీడియం సినిమాలోని దృశ్యాలు గుర్తుకొస్తే అది వీక్షకులు తప్పు కానే కాదు.
ప్రధాన పాత్రధారులు మెరిశారు
ఒకటి మాత్రం నిజం.. చిత్ర కథనం ఎలా ఉన్నా ప్రధాన పాత్ర ధారులు ముగ్గురూ ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలయ్యే సినిమాలకు అర్హమైన నటనను పండించడంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోలేదు. బాలీవుడ్‌లో ప్రతిభ ఉండి కూడా దాన్ని సద్వినియోగపర్చుకోలేకపోయిన కొద్ది మంది నటుల్లో అభిషేక్ బచ్చన్ ఒకరు. ఇన్నేళ్లుగా తాను తీసిన సినిమాలన్నింటికంటే ఉత్తమమైన నటనను దస్విలోనే చూస్తాం. సినిమా అంతా కూడా తానే వన్ మాన్ షో చేశాడని చెప్పొచ్చు. తను నటిస్తున్నాను అనే విషయం కూడా మర్చిపోయినట్లుగా తన సొంత సహజ ప్రవృత్తిని పాత్రకు మల్చుకుని రంజింపజేశాడు. ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా సీఎంగా చాలా గొప్ప నటనను తాను కనబరిచాడు. అలాగే పలు సన్నివేశాల్లో అయితే తనలోని కామెడీ యాంగిల్ గానీ భావోద్వేగాలు గానీ ఆకట్టుకుంటాయి. తన యాస, డైలాగ్ డెలీవరీ, నిరాక్షరాస్యుడిగా పలికే కొన్ని మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. రాజకీయ నాయకుడి వ్యవహార శైలీ, అహంకారం, కామెడీ టైమింగ్, హావాభావాలు ఎంతో మెచ్చుకునేలా ఉన్నాయి. ప్రత్యేకించి సినిమా మూలమలుపుకు తిరుగుతున్న సమయంలో వీక్షకులను అభిషేక్ ఒక్కసారిగా తనవైవుకు తిప్పుకున్నాడు.
ఇక విమలాదేవిగా నిమ్రత్ కౌర్ నటనాపరంగా ఇతర పాత్రలను అలా తీసిపడేసింది. గంగారామ్ చౌదరి భార్య విమలాదేవిగా నిమ్రత్ కౌర్ తన నటనతో మెస్మరైజ్ చేసిందనే చెప్పవచ్చు. వ్యంగ్యాన్ని పరాకాష్టకు తీసుకుపోయిన తన హావభావాలు, గృహిణి నుంచి సీఎంగా మారిన తన పరివర్తన తీరు చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఆమె యాక్షన్ పడి పడి నవ్వేలా చేస్తుంది. హస్యానికి పట్టం కట్టిన సంభాషణలతో ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రిగా, భర్తను తొక్కేసే భార్యగా, సెల్ఫీల పిచ్చి ఉన్న సెలబ్రిటీగా తన నటనతో చాలా వరకు నిమ్రత్ కౌర్ అలరించిందనే చెప్పాలి.
కాగా, జైలు సూపరింటెండెంట్ జ్యోతి దేశ్వాల్‌గా యామీ గౌతమ్ తనలో దాగివున్న ప్రతిభను మొత్తంగా వెలికి తీసుకొచ్చింది. పై అధికారి హుందాతనం, అహంకారం నిండి ఉన్న రాజకీయ ఖైదీకి గుణపాఠం చెప్పే పోలీసు అధికారిగా ఆమె నటన ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటిదాకా పూర్తి వినోదభరితంగా సాగి.. సినిమా క్లైమాక్స్‌లో మాత్రం అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్ మధ్య వచ్చే భావోద్వేగ దృశ్యాలు వీక్షకులను కట్టిపడేస్తాయి. ప్రత్యేకించి యామీ గౌతమ్ పాత్ర సినిమా మొత్తానికి మూలబిందువై నిల్చుంది. తన ప్రతిభకు తగిన పాత్రలను ఎంచుకోవడంతో ఆమెలో పరిణతి దస్వీలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
అన్నీ బాగున్నాయి కానీ.. మ్యాజిక్ లేని కథ
నేటికాలంలో విద్య ఎంత అవసరం అనే వాస్తవాన్ని చెప్పే సదుద్దేశం, వీక్షకులకు వినోదాన్ని అందించడం ప్రాతిపదికన తీసిన సినిమా దస్వి. కానీ దర్శకుడు తుషార్ జలోటా ఒక సింగిల్ సందేశాన్ని చెప్పడానికి అనేక అంశాలను కలిపి వాడటంతో అది ప్రధానాంశంపై దృష్టిని మళ్లించివేసింది. సినిమాలో అన్నీ బాగుండి ఒక్క రైటింగ్ విభాగం తేలిపోతే సినిమా మొత్తం తన బిగువును ఎలా కోల్పోతుందో దస్విని చూసి చెప్పవచ్చు. సంభాషణల్లో కానీ, కథలో కానీ ఎలాంటి మ్యాజిక్ అనేది కనిపించకపోవడమే దస్వీ సినిమాను పలుచన చేసింది. శిక్ష పడిన మాజీ ముఖ్యమంత్రి, గృహిణిగా ఉండి అనుకోకుండా ముఖ్యమంత్రిగా మారిన విమలాదేవి పాత్రలు ఎందుకు అంత ఆకస్మిక పరివర్తనకు గురయ్యాయనేది బలంగా చెప్పలేకపోయారు. కేరికేచర్లలాగా ఈ రెండు పాత్రలూ చకచకా మనముందుకు అలా వచ్చి ఇలా వేళ్లిపోతుంటాయి. అణకువ కలిగిన గృహిణిగా మెలిగిన సీఎం భార్య తనకు అధికారం ఆయాచితంగా దఖలు పడగానే భర్తనే పదవ తరగతి పాస్ కాకుండా కుట్ర చేసేంత, భర్తనే జైల్లోంచి విడుదల కాకుండా చూసేంత విపరీత స్థాయికి ఎలా మారిందన్నది ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. రాజకీయ నేతల కుటుంబాలను టీవీ సీరియల్స్‌లో చూపించే ఫక్తు విలనిజంలోకి దింపేయడంలో ఏమాత్రం వాస్తవికత లేదనిపిస్తుంది. సీఎం భార్యను టీవీ సీరియల్స్‌లో కనబడే వికృత మహిళలను మించిన అధికార లాలస కలిగిన పాత్రగా మార్చడంలో ఔచిత్యం ఉందా అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహిళలకు అధికారంపై, పదవులపై ఆశలు, ఆకాంక్షలు ఎందుకు ఉండకూడదు అనే కోణం నుంచి దర్శకుడు ఆలోచించలేక విమలాదేవి పాత్రను విలనీగా మార్చేశాడా అనిపిస్తుంది.
తారేజమీన్ (చదవడానికి ఇబ్బందిపడటం), రంగ్ దే బసంతి (స్వాతంత్ర్య సమరయోధుల గాధలు), లాగే రహో మున్నా బాయ్ (పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటిలోని పాత్రలు సజీవంగా మనముందుకు రావడం) వంటి స్పష్టమైన ప్రస్తావనలను దస్వి సినిమా చూపించింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏం ఇవ్వాలో అన్ని ఇవ్వడానికి ఈ సినిమా ప్రయత్నించింది కానీ పాత్రలకు కేరికేచర్ తరహా లుక్ ఇవ్వడంతో దర్శకుడు ఎంత ప్రయత్నించినా సినిమాను ఆసక్తికరంగా మల్చలేకపోయాడు. రచయితలు సురేష్ నాయర్, రితీష్ షాలు కథకు గానీ, డైలాగులకు కానీ ఎలాంటి మ్యాజిక్‌ని కల్పించలేకపోయారు. నేరాలకు అలవాటుపడిన రాజకీయ నేత ఒక్కరాత్రిలో ఎలా మారిపోతాడు అని ఆశ్చర్యపోతాం. కానీ ఆ పరివర్తనకు దారితీసిన నొప్పిని కానీ, ఘర్షణను కానీ సినిమా బలంగా చూపలేకపోయింది. ప్రతి పాత్ర చేత హర్యాన్వి మాండలికాన్ని పలికించడంలో మాత్రమే చిత్రం విజయాన్ని సాధించింది.
ఒకవైపు దక్షిణాది దర్శకులు పంచ్ డైలాగులతో, బిగువైన కథనంతో, భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకుపోతూ, కమర్షియల్‌గా ఎంత విజయాన్ని సాధిస్తున్నారో చిత్ర ప్రపంచం గమనిస్తోంది. ఓటీటీల్లో కూడా చాలా మంచి డైరెక్ట్ సినిమాలు గత రెండేళ్లుగా విడుదలయ్యాయి. కానీ విద్య ప్రాధాన్యం గురించి చెప్పాలనుకున్న దస్వీ వాటి ప్రమాణాలను అందుకోవడంలో వెనుకబడిపోవడం విచారకరమనే చెప్పాలి. నిజం చెప్పాలంటే దస్వీ బలమైన సబ్జెక్టు కలిగిన చిత్రం. విద్య ప్రాధాన్యంపై, ప్రత్యేకించి మన రాజకీయనేతలకు విద్య ప్రాధాన్యతపై దృష్టి పెట్టిన సినిమానే అయినప్పటికీ, పాత్రలకు పేలవమైన ట్రీట్‌మెంట్ ఇచ్చిన కారణంగా దస్వీ సినిమా చెప్పదల్చుకున్నది శక్తివంతంగా చెప్పలేకపోయింది.
ఒక నిరక్షరాస్యుడైన రాజకీయ నేత విద్యకున్న విలువను జైల్లో శిక్ష అనుభవిస్తున్న కాలంలో తెలుసుకుంటాడు. ఎంత గొప్ప భావనో కదా.. కానీ ఇంత గొప్ప సినిమాను కామిక్ బుక్ ఫాంటసీగా చిత్ర దర్శకుడు ఎందుకు తీసినట్లు? సినిమా ద్వారా తాము చెబుతున్న సందేశాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని చిత్ర దర్శకులు చెప్పదలిచారా అన్నది ప్రశ్న. దస్వి సినిమా మొత్తంగా చూశాక మనకు కలిగే అభిప్రాయం ఇదే మరి. ఈ ప్రధాన లోపం మినహాయిస్తే అసభ్యతకు ఆమడదూరంలో నిలిచిన ఓటీటీ చిత్రంగా దస్విని అందరూ చూడవచ్చు.
నటీనటులు: అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్, యామీ గౌతమ్, డానిష్ హుస్సేన్, రవీష్ శ్రీవత్స, మను రిషి చద్దా, అరుణ్ కుష్వా, చిత్తరంజన్ త్రిపాఠి
కథ: రామ్ బాజ్‌పాయ్
దర్శకత్వం: తుషర్ జలోటా
సంగీతం: సచిన్-జిగర్
నిర్మాతలు: దినేష్ విజన్, సందీప్ లేజెల్
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా
విడుదలైన తేదీ: ఏప్రిల్ 7, 2022