- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్జ్యూమర్ బంకులకు గడ్డుకాలం.. వారి వింత పోకడే కారణమా!
దిశ ప్రతినిధి, కరీంనగర్: తమ పరిధిలోని వాహనాలకు నాణ్యమైన పెట్రోల్, డిజిల్ విక్రయించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన కన్జ్యూమర్ బంక్‌లు మూతపడుతున్నాయి. కమర్షియల్ బంకుల్లో కన్న ఎక్కువ ధరకు ఇక్కడ విక్రయిస్తుండడంతో కొనేవారు లేకుండా పోయారు. కమర్షియల్ బంకుల కన్నా రూ.26 వరకూ ఎక్కువ ధరతో పెట్రోల్, డిజిల్ విక్రయాలు జరుగుతుండటంతో కన్జ్యూమర్ బంకులన్ని తాత్కాలికంగా మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ వ్యాప్తంగా కమర్షియల్ బంకులతో పాటు కన్జ్యూమర్ బంకులు కూడా ఓపెన్ చేశాయి ఆయా కంపెనీలు. వీటిల్లో కన్జ్యూమర్ బంకులు కో ఆపరేటివ్ సొసైటీలు, సింగరేణి, ఆర్టీసీ, ఫిఝరీస్ కో ఆపరేటివ్ సొసైటీలు, పోలీసు విభాగం ఏర్పాటు చేసుకుంటాయి. కంపెనీలతో జరిగే ఒప్పందంలో భాగంగా బంకులను ఏర్పాటు చేసి వాహనాలకు పెట్రోలియం ఉత్పత్తులు విక్రయిస్తుంటారు.
జనవరి నుండి..
సాధారణంగా కమర్షియల్ బంకుల్లో కన్నా కన్జ్యూమర్ బంకుల్లో తక్కువ ధరకు పెట్రోలియం ఉత్పత్తులు విక్రయిస్తుండడంతో చాలా మంది వాహనదారులు ఇక్కడే పెట్రోల్ నింపుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రాఫిట్ తక్కువ చూసుకుని వినియోగదారులకు తక్కువ ధరకు అమ్ముతుండడం వల్ల టర్నోవర్ కూడా రూ. కోట్లలో ఉండేది. ఆయా సహకార సంఘాల పరిధిలోని రైతులు తక్కువ ధరకు పెట్రోల్, డిజిల్ కొనుగోలు చేస్తుండడంతో ఆర్థిక భారం కూడా తగ్గేది. అలాగే ఆర్టీసీ, పోలీసు విభాగాలు మాత్రం తమ శాఖలకు చెందిన సొంత వాహనాల్లో వినియోగించుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చేవి. కానీ గత జనవరి నుండి పెట్రోల్ ధర మార్కెట్ కంటే రూ. 26 ఎక్కువగా, డిజిల్ ధర రూ. 17 ఎక్కవగా అమ్మాల్సిన పరిస్థితి తయారైంది. పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ బంకులకు తక్కువ ధరకే సరఫరా చేస్తుండగా కన్జ్యూమర్ బంక్‌లకు మాత్రం ఎక్కువ ధరకు సప్లై చేస్తున్నాయి. దీంతో కన్జ్యూమర్ బంకుల వైపు కన్నెత్తి చూసే వారే లేకుండా పోయారు. అలాగే కమర్షియల్ బంకులకు రూ. 4 రూపాయల వరకు సబ్సీడీ, రూ. 3 వరకూ కమిషన్ కూడా పెట్రోలియం కంపెనీలు ఇస్తుంటాయి. కన్జ్యూమర్ బంకులకు మాత్రం రూ. 2 రూపాయలతోనే సరిపెడ్తున్నాయి, సబ్సీడీ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో మార్కెట్ రేటులో పెట్రోల్, డిజిల్ విక్రయించాలంటే సంస్థలు ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. రోజుకు రూ. లక్షల్లో నష్టపోవడం కన్న తమ బంకులను మూసి వేయడమే బెటర్ అని భావించి చాలా వరకూ బంకులు మూత పడ్డాయి. ఒక్క తెలంగాణాలోనే 100 నుండి 150 కన్జ్యూమర్ బంకులు ఉండగా వీటిల్లో చాలా వరకు మూసివేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నేడో రేపో ప్రారంభించాల్సిన బంకులు కూడా నిర్మాణ దశలోనే అర్థాంతరంగా ఆగిపోయాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 40 వరకూ బంకులు కన్జ్యూమర్ కోటాలో నిర్వహిస్తున్నారు.
కమర్షియల్ బాట..
పెట్రోలియం కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ, పోలీసులతో పాటు సోసైటీలు కూడా కమర్షియల్ బంకుల బాట పట్టాయి. తమకు అవసరమైన ఇంధనాన్ని నేరుగా కంపెనీల నుండి కొనుగోలు చేసుకున్నట్టయితే రూ. కోట్లలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని గుర్తించి.. కమర్షియల్ బంకుల్లోనే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల తమ విభాగాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
బంక్ క్లోజ్ చేశాం: ప్రదీప్ రెడ్డి, ఊటూరు సొసైటీ అధ్యక్షులు
కమర్షియల్ బంకులకు తక్కువ ధరకు, కన్జ్యూమర్ బంకులకు ఎక్కువ ధరకు పెట్రోల్, డిజిల్ సరఫరా చేస్తుండడం వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇంతకాలం కమర్షియల్ బంకులకన్నా తక్కువ ధరతో పాటు నాణ్యమైన పెట్రోల్, డిజిల్ దొరుకుతుందని వినియోగదారులకు నమ్మకం ఉండేది. గత జనవరి నుండి మా బంకుల వైపు కన్నెత్తి చూసే వారే లేకుండా పోయారు. మార్కెట్‌లో పలుకుతున్న ధరకు తగ్గట్టుగా అమ్మాలంటే సొసైటీలపై ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది. రోజు రూ.లక్షల్లో జరిగే నష్టాన్ని కొని తెచ్చుకోవడం కంటే బంకును మూసి వేయడమే మంచిదని భావించాం. రైతులు కూడా బంకు ఓపెన్ చేయాలని కోరుతున్నారు.. కానీ ఎక్కువ ధరకు అమ్మితే మా వద్ద కొనే వారు ఎవరూ ఉండరు, తక్కువ ధరకు అమ్మితే సొసైటీని నష్టాల ఊబిలోకి నెట్టేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి బంకును మూసి వేయడమే మంచిదని నిర్ణయించుకుని లావాదేవీలను నిలిపివేశాం.