టీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరంగా చెబుతాం: భట్టి

by GSrikanth |   ( Updated:2022-03-14 13:28:26.0  )
టీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరంగా చెబుతాం: భట్టి
X

దిశ, చౌటుప్పల్: భూదానోద్యమంలో ఆచార్య వినోబాబావే నిరుపేదలకు భూములు పంచితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పేరుతో పెద్దలకు భూములను పంచి పెడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. భూదాన ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి సర్వోదయ సంకల్ప యాత్రను సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ ప్రారంభించారు. ఈ యాత్ర 600 కిలోమీటర్లు కొనసాగి మహరాష్ట్రలోని సేవాగ్రామ్ లో ముగుస్తుంది.

ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వినోబాబావే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్లు వందల ఎకరాలను దానం చేస్తే.. అదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 45 లక్షల ఎకరాలను సేకరించి పేదలకు పంచారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూములు ధరణి పోర్టల్ రికార్టుల్లో ఎక్కించకుండా టీఆర్ఎస్ ఇబ్బంది పెడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులంతా సర్వోదయ సంకల్ప యాత్రలో పాల్గొని టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, చేస్తున్న దోపిడీ గురించి ప్రజలకు వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, బోస్ రాజ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story