ఎక్స్ పార్టనర్‌పై కోపం తీర్చుకోవాలా? బొద్దింకకు వాళ్ల పేరు పెట్టండి!

by Disha Desk |
ఎక్స్ పార్టనర్‌పై కోపం తీర్చుకోవాలా? బొద్దింకకు వాళ్ల పేరు పెట్టండి!
X

దిశ, ఫీచర్స్ : ప్రేమికులకు 'వాలెంటైన్స్ డే' ఓ పండుగ రోజు. అయితే కొందరికి ఈ స్పెషల్ డే మరిచిపోని చేదు జ్ఞాపకం కూడా కావచ్చు. ఆ పెయిన్ వారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి భగ్న ప్రేమికుల హృదయంలోని కొంత బాధనైనా తగ్గించేందుకు కొన్ని సంస్థలు వినూత్నంగా ముందుకు వచ్చాయి.

యూకేకు చెందిన హెమ్స్‌లే కన్జర్వేషన్ సెంటర్ సహా బ్రిస్టల్ యానిమల్ రెస్క్యూ సెంటర్.. ప్రజల బాధలను తగ్గించేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు హెమ్స్‌లే కన్జర్వేషన్ సెంటర్ తమ ప్రసిద్ధ 'నేమ్ ఎ కాక్రోచ్ ప్రోగ్రామ్'ని తిరిగి ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రేయసి/ప్రియుడు తమ ఎక్స్ పార్టనర్‌తో బ్రేకప్ చేసుకుంటే, వారి పేరును బొద్దింకకు పెట్టేందుకు అనుమతిస్తుంది. ఇందుకోసం తమ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా 1.50 పౌండ్ల విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రేమికుల రోజున 'వర్త్‌లెస్ ఎక్స్-సమ్‌వన్' అనే 'రోచ్ బోర్డ్'పై ఆ పేరును బహిర్గతం చేస్తారు. ప్రేమికులనే కాదు బాధపడే ఎవరైనా సరే తమకు నచ్చని వారి పేరు బొద్దింకలకు పెట్టుకునే సౌలభ్యం ఇక్కడ ఉంది. అంతేకాదు 'బొద్దింకకు రాజకీయ నాయకుడి పేరు పెట్టాలనుకున్నా, ఇంకా ఎవరి పేరు పెట్టుకోవాలన్నా మీకు స్వాగతం. జంతు ప్రదర్శన శాలలో చేస్తున్న ప్రాజెక్ట్స్ సహా ఇక్కడున్న అన్ని జంతువులను సంరక్షించడంలో మీరిచ్చిన విరాళాలు మాకు దోహదపడతాయి' అని హెమ్స్‌లే కన్జర్వేషన్ సెంటర్‌లోని ఆపరేషన్స్ మేనేజర్ హెన్రీ వీడన్ పేర్కొన్నాడు.

బ్రిస్టల్ యానిమల్ సెంటర్ కూడా 'పూ ఇంటు పౌండ్స్' అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఎవరైనా సరే ఐదు పౌండ్ల విరాళమిచ్చి, పిల్లి లిట్టర్ ట్రేలో తమకు అన్యాయం చేసిన వ్యక్తి పేరును జోడించవచ్చు. 'ఈ వాలెంటైన్స్ డే రోజున మీ మాజీ, మీ బాస్ లేదా మీరు కోపంగా భావించే ఎవరినైనా సరే ఎంచుకోండి. వారిపై మా పిల్లులు విరుచుకుపడతాయి' అని బ్రిస్టల్ యానిమల్ సెంటర్ పేర్కొంటుంది. ఈ కార్యక్రమాలు నిధులను సేకరించడంలో విజయవంతం కావడం మాత్రమే కాదు ప్రజలు తమ భావోద్వేగాలను బయటపెట్టేందుకు ఆహ్లాదకరమైన మార్గాన్ని అందిస్తున్నాయి.

Advertisement

Next Story