రష్యా నుంచి భారత్‌కు వచ్చే ప్రయత్నాలు చేస్తున్న సెమీకండక్టర్ల తయారీ కంపెనీలు!

by Harish |
రష్యా నుంచి భారత్‌కు వచ్చే ప్రయత్నాలు చేస్తున్న సెమీకండక్టర్ల తయారీ కంపెనీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండేళ్లుగా ఆటోమొబైల్ పరిశ్రమ సెమీకండక్టర్ల కొరత వల్ల చాలా కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న సమయంలో ఇటీవల నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఉన్న సమయంలో యుద్ధం కారణంగా ఉత్పత్తిని నిలిపేయాలని రష్యా వాహన తయారీదారులు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సెమీకండక్టర్ల కంపెనీలు రష్యాలో ఉత్పత్తి అయిన వాటిని ఇతర దేశాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్నాయి. యూరప్, దక్షిణ కొరియాలోని అనేక కంపెనీలు భారత్‌ను అనువైన ప్రాంతంగా భావిస్తున్నాయి. దీంతో 15 లక్షల యూనిట్ల మార్కెట్ కలిగిన రష్యా నుంచి ఎక్కువ శాతం కంపెనీలు తమ ఉత్పత్తులను భారత్ లాంటి పెరుగుతున్న గ్లోబల్ మార్కెట్‌లకు మళ్లించే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు.

రష్యాలో తయారైన సెమీకండక్టర్లను భారత్‌లోని ఆయా కంపెనీల యూనిట్లకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని ద్వారా భారత్‌లో తయారీ యూనిట్లను కలిగి ఉన్న కియా, హ్యూండాయ్ మోటార్స్, వోక్స్‌వ్యాగన్, స్కోడా, రెనాల్ట్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల కంపెనీలు లబ్ధి పొందనున్నాయి. సెమీకండక్టర్ల కొరత వల్ల దేశీయ కంపెనీలు దాదాపు రూ. 40 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయని అంచనా. ఇప్పుడు రష్యాలో ఆగిపోయిన అమ్మకాలతో అక్కడ తయారైన వాటిని ఇతర మార్కెట్లకు తరలించడమే పరిష్కారమని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల దేశీయ ఆటో కంపెనీలకు కలిసొస్తుందని, ఇప్పటికే నెలల తరబడి ఉత్పత్తి ఆగిపోయి వాహనాల డెలివరీలకు ఎక్కువ కాలం వేచి ఉన్న వినియోగదారులకు లాభిస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story