VLC మీడియా ప్లేయర్ యూజ్ చేస్తున్నారా? అయితే మీ డేటా గల్లంతే!

by Manoj |   ( Updated:2022-05-04 08:09:11.0  )
VLC మీడియా ప్లేయర్ యూజ్ చేస్తున్నారా? అయితే మీ డేటా గల్లంతే!
X

దిశ, ఫీచర్స్ : పీసీ, ల్యాప్‌టాప్, మొబైల్ ఉన్న ప్రతీ ఒక్కరికీ వీఎల్‌సీ (VLC) మీడియా ప్లేయర్ గురించి తెలుసంటే అతిశయోక్తి కాదేమో. ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం, ఓపెన్ సోర్స్ ఫైల్ కావడం, ప్రతీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండటంతో అందరూ దీన్నే వినియోగించేవారు. న్యూ టైప్ ఆఫ్ మీడియా ప్లేయర్స్ అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ ఉపయోగించేవారు లేకపోలేదు. ఈ విషయాన్ని అవకాశంగా తీసుకున్న చైనీస్ హ్యాకర్స్ ఈ మీడియా ప్లేయర్‌ సాయంతో మాల్‌వేర్ అటాక్ చేస్తున్నారు.

ప్రభుత్వ సంబంధిత సంస్థలపై గూఢచర్యం చేసేందుకు ఉపయోగించే మాల్వేర్‌ను ప్రవేశపెట్టేందుకు చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ సికాడా (స్టోన్ పాండా లేదా APT10) విండోస్ సిస్టమ్‌లలో VLCని ఉపయోగిస్తోందని సిమాంటెక్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. అంతేకాదు స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన సంస్థలను సికాడా లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, హాంకాంగ్, టర్కీ, ఇజ్రాయెల్, ఇండియా, మోంటెనెగ్రో, ఇటలీలో హ్యాకర్స్ ఇప్పటికే మాల్వేర్ దాడి ప్రారంభించినట్లు గుర్తించారు.

ఈ మేరకు వీఎల్‌సీ క్లీన్ వెర్షన్‌ సాయంతో హానికరమైన ఫైల్స్‌‌ను పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్ టాప్‌‌లోకి ప్రవేశపెడుతున్నారని తెలిపారు. దీంతో ఆ సిస్టమ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు VNCరిమోట్-యాక్సెస్ సర్వర్‌ని ఉపయోగిస్తున్నారు. గతంలో హెల్త్‌కేర్ పరిశ్రమను టార్గెట్ చేసిన ఈ గ్రూప్.. ప్రస్తుతం రక్షణ, విమానయానం, షిప్పింగ్, బయోటెక్నాలజీ, ఇంధన రంగాలే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. అందువల్ల వీఎల్‌సీ మీడియా ప్లేయర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed