లాడ్జిలో వ్యాపారి ఆత్మహత్య.. హైదరాబాద్‌లో మిస్సింగ్ కేసు

by Javid Pasha |
లాడ్జిలో వ్యాపారి ఆత్మహత్య.. హైదరాబాద్‌లో మిస్సింగ్ కేసు
X

దిశ, కామారెడ్డి రూరల్ : లాడ్జి గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. లాడ్జి వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్ఓ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌కు చెందిన రమని గోవింద్ లాల్ ఈ నెల 12 న బైకుపై కామారెడ్డికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీ సాయికృష్ణ లాడ్జిలోని రూమ్ నంబర్ 106 లో అద్దెకు దిగాడు. ఈ నెల 14 న వార్డు బాయ్ అంజయ్యతో మంచినీళ్లు తెప్పించుకోగా ఇంకా ఏమైనా కావాలా అని అంజయ్య గోవింద్ లాల్‌ను అడిగాడు. ఏమి అవసరం లేదు.. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అంటూ రాత్రి 8 గంటలకు డోర్ లాక్ చేసుకుని పడుకున్నాడు.

రెండు రోజులుగా ఆ గది నుంచి ఎలాంటి ఉలుకూ పలుకు లేకపోవడంతో బుధవారం లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గది లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో డోర్ పగులగొట్టి పోలీసులు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్లిన పోలీసులకు గోవింద్ లాల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ విషయమై గోవింద్ లాల్ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగిందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ఈ నెల 12 న పేట్ బషీర్ బాగ్‌లో గోవింద్ లాల్ అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు కేసు పెట్టారని, గోవింద్ లాల్ మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.



Advertisement

Next Story