తెలంగాణ వ్యాప్తంగా రేషన్‌ పంపిణీకి బ్రేక్?

by Nagaya |   ( Updated:2022-03-11 00:15:51.0  )
తెలంగాణ వ్యాప్తంగా రేషన్‌ పంపిణీకి బ్రేక్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. వారం రోజులుగా సర్వర్ డౌన్ అయింది. ఒక్కో దుకాణంలో రోజుకు పది మందికి మించి సరుకులు ఇవ్వలేకపోతున్నామని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులను సర్దిపుచ్చలేక సతమతమవుతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని రేషన్ దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. వినియోగదారులు గంటల తరబడి దుకాణాల దగ్గర వెయిటింగ్‌లో ఉంటున్నారు. సర్వర్ గాడిన పడుతుందేమోనని ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల డీలర్లతో ఘర్షణలూ జరుగతున్నాయి. ప్రజలు అన్ని పనులు ఆపుకోని దుకాణాలకు వస్తే వట్టి చేతులతో తిరిగిపోతున్నారు. సర్వర్ డౌన్ సమస్యతో ఏమీ చేయలేక రేషన్ డీలర్లు తల పట్టుకుంటున్నారు.

నెల ప్రారంభం కావడంతో రేషను బియ్యం కోసం ప్రజలు దుకాణాలకు వస్తుంటారు. కానీ ఒక్కో కార్డు ట్రాన్సాక్షన్‌కు అరగంట పడుతున్నదని, సర్వర్ నుంచి సిగ్నల్ రాని కారణంగా ఆలస్యమవుతున్నదని డీలర్లు మొత్తుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఈ సమస్యను వివరించి ఐదు రోజులైనా పరిస్థితిలో మార్పు లేదని డీలర్లు వాపోతున్నారు. వినియోగదారులు ప్రతీరోజూ ఇదే సమస్యా అంటూ తిట్టిపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమవైపు నుంచి ఏ తప్పూ లేకున్నా ప్రజల నుంచి మాటలు పడాల్సి వస్తున్నదని, అధికారుల తప్పిదానికి బాధితులుగా మిగిలిపోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల నుంచి ఒత్తిడి విపరీతంగా ఉంది

సర్వర్ సమస్య వారం రోజుల నుంచి తీవ్రంగా ఉంది. ఉదయం షాప్ ఓపెన్ చేసిన తర్వాత సర్వర్ వస్తుందని ప్రజలకు నచ్చచెప్తున్నాం. ప్రతీ రోజూ ఇదే సమాధానం చెప్పాల్సి వస్తున్నది. కానీ సర్వర్ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు.

- సత్యనారాయణ, నవీపేట్ మండల రేషన్ దుకాణాల సంఘం అధ్యక్షుడు

Advertisement

Next Story

Most Viewed