బీజేపీ బాట ఇదే.. టీఆర్ఎస్​ను వెంటాడేలా భారీ వ్యూహం

by Nagaya |   ( Updated:2022-07-05 00:00:53.0  )
బీజేపీ బాట ఇదే.. టీఆర్ఎస్​ను వెంటాడేలా భారీ వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలోని ఆ పార్టీ శ్రేణులు ఇక జనం బాట పట్టనున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో బహిరంగసభ సక్సెస్ అయిందనే ఉత్సాహంతో ఉన్న రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ వేడి మీదనే పల్లెల్లోకి వెళ్ళే యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేస్తున్నది. అడుగడుగునా టీఆర్ఎస్‌ను వెంటాడి రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమల్లోని వైఫల్యాలను ఎండగట్టాలనుకుంటున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో ప్రజలను భాగస్వాములను చేయాలనుకుంటున్నది. ప్రధాని మోడీ ఇచ్చిన డైరెక్షన్‌లో భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తున్నది. అందులో భాగంగా రాష్ట్ర, జిల్లా నాయకులతో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని బండి సంజయ్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే బూత్‌ స్థాయి ఇన్‌చార్జిలను నియమించడంతో త్వరలో 'పన్నా ప్రముఖ్' వ్యవస్థను కూడా గాడిలో పెట్టి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నది. రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంటు ఎన్నికల మొదలు పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ, విశ్వాసం పెరుగుతున్నదని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. ఇలాంటి సానుకూల వాతావరణాన్ని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వినియోగించుకోవాలని అనుకుంటున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో బూత్ వరకు ప్రజలకు చేరువ కావాలనుకుంటున్నది.

ప్రతీ పోలింగ్ బూత్‌కు ఇప్పటికే ఇన్‌చార్జిలను నియమించిన పార్టీ త్వరలో అక్కడి ఓటర్లను తరచూ కలిసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నది. 'పన్నా ప్రముఖ్' పేరుతో ఓటర్ల జాబితాలో ఒక్కో పేజీలో ఉన్న ఓటర్లకు ఒకరి చొప్పున బాధ్యులను నియమించనున్నది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పిలుపులో భాగంగా 'హర్ ఘర్ తిరంగా' పేరుతో అన్ని ఇండ్లకూ దగ్గరయ్యే ప్రోగ్రామ్‌కు త్వరలో శ్రీకారం చుట్టనున్నది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ వైఫల్యాలపై, మోడీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికీ వివరించాలనుకుంటున్నది.

బీజేపీ కేవలం హిందు మతస్తులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించే పార్టీగా సాధారణ అభిప్రాయం ఉన్న నేపథ్యంలో దీన్ని తొలగించడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలనుకుంటున్నది. ముస్లింలంతా వ్యతిరేకులు కాదని, చాలా మంది బీజేపీకి అనుకూలంగా ఉన్నారని జాతీయ సమావేశాల్లో నడ్డా, అమిత్ షా సహా సీనియర్ నేతలు పలువురు వ్యాఖ్యానించడంతో ఇప్పుడు ఆ దిశగా కూడా రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నది. ట్రిపుల్ తలాక్ నిర్ణయాన్ని చాలా మంది ఆహ్వానించారని, ఆ కారణంగా చాలా మంది బీజేపీకి దగ్గరయ్యారని, దీన్ని నిలుపుకుంటూనే వీలైనంత ఎక్కువ మందికి చేరువ కావడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ఒక స్టేట్ లీడర్ తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జరిగిన నిర్ణయాలు, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశాల్లో వివరించిన అంశాలతో తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిందిగా సూచించారు.

స్టేట్ చీఫ్ బండి సంజయ్ రెండు విడతలుగా నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలకు వివిధ సెక్షన్ల నుంచి వచ్చిన స్పందన, కొత్తగా గ్రామ స్థాయిలో కేడర్ తయారుకావడాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో థర్డ్ ఫేజ్ కోసం కసరత్తు మొదలైంది. తొలుత భద్రాద్రి నుంచి మొదలుపెట్టి యాదాద్రి వరకు కొనసాగించాలన్న ఆలోచన ఉన్నా ఇప్పుడు బాసరలో మొదలుపెట్టి కీసరలో ముగించడంపైనా చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు 'హర్ ఘర్ తిరంగా', మరోవైపు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పల్లెల్లో, మండలాల్లో యాక్టివిటీని పెంచాలనుకుంటున్నది. సౌతిండియాలో ఇప్పటికే కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలోనూ కైవశం చేసుకోవడం ద్వారా గేట్‌వేగా మార్చుకోవాలనుకుంటున్నది.

ఇప్పుడున్న సానుకూల పరిస్థితులు, కార్యకర్తల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు, 'విజయ సంకల్ప్' ద్వారా నెలకొన్న ఉత్సాహాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముమ్మరమైన కార్యాచరణను పార్టీ రూపొందించే పని మొదలుపెట్టింది. 'మనం నిద్ర పోవొద్దు.. టీఆర్ఎస్‌ను నిద్ర పోనివ్వొద్దు' అంటూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. సమిష్టిగా పనిచేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌లోకి రావడమే ఏకైక ఎజెండాగా పనిచేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకత్వం కూడా బూత్ స్థాయి వరకు రోడ్ మ్యాప్‌‌ను ఖరారు చేస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed