బైక్‌తో యాక్టివాను ఢీకొట్టి.. రూ 50 లక్షలతో పరార్

by S Gopi |
బైక్‌తో యాక్టివాను ఢీకొట్టి.. రూ 50 లక్షలతో పరార్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుకనుండి మరో వాహనంతో ఢీకొట్టి రూ. 50 లక్షలను దోచుకుపోయిన సంఘటన అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జాంబాగ్ పూసల బస్తీ ప్రాంతంలో నివాసముండే జోగ్ సింగ్ ఫీల్ ఖానా వద్ద స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో తన దుకాణంలో పని చేసే మిట్టాలాల్ రాజ్ పుత్ పురోహిత్ కి ఆ నగదును ఇచ్చి పూసల బస్తీలోని తన ఇంట్లో ఇవ్వమని చెప్పాడు. అతను హోండా యాక్టివాపై డబ్బులు ఇచ్చేందుకు వెళ్తుండగా పూసల బస్తీలో వెనుక నుండి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి మిట్టాలాల్ రాజ్ పుత్ పురోహిత్ నడుపుతున్న హోండా యాక్టివాను ఢీకొట్టడంతో అతను కింద పడిపోయాడు. వెంటనే ఢీకొట్టిన ఇద్దరు వ్యక్తులు డబ్బులున్న బ్యాగ్ ను తీసుకుని అక్కడి నుండి పరారయ్యారు. వాహనంపై నుండి కింద పడడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న అతను యజమానికి ఫోన్ ద్వారా డబ్బులు దోచుకుపోయిన విషయమై సమాచారం అందించాడు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించి దోపిడిపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకువెళ్తున్నట్లుగా ముందుగా సమాచారం తెలిసిన వాళ్లే స్కెచ్ వేసి డబ్బులు దోచుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనలో మిట్టాలాల్ రాజ్ పుత్ పురోహిత్ ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed