బ్రేకింగ్: వైద్యుడి నిర్లక్ష్యం.. పది మంది మహిళలకు మత్తు మందు ఇచ్చి..

by Satheesh |   ( Updated:2022-03-26 13:17:45.0  )
బ్రేకింగ్: వైద్యుడి నిర్లక్ష్యం.. పది మంది మహిళలకు మత్తు మందు ఇచ్చి..
X

దిశ, భువనగిరి రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన 10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడాడు ఓ వైద్యుడు. వివరాల్లోకి వెళితే.. యదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గల ఏరియా ఆసుపత్రిలో శనివారం రోజు వివిధ మండలాల నుంచి ట్యూబెక్టమీ ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలకు ప్రభుత్వ వైద్యుడు వారికి ఉదయం మత్తు ఇంజక్షను ఇచ్చి వెళ్ళిపోయాడు. వైద్యుడు ఎంతవరకు రాకపోవడంతో బాధితుల బంధువులు ఆందోళన చెంది.. ఆసుపత్రిలో సిబ్బందిని వివరణ అడగగా ఎవ్వరి నుంచి స్పందన రాకపోవడంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితుల బంధువులు మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పేరు మీద భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి పిలిపించి ఆపరేషన్లు నిలిపివేసి.. వైద్యులు తమ ప్రాణలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.

వెంటనే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, విధిగా నిర్వహించాల్సిన ఆపరేషన్లను మూడు సంవత్సరాలుగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యులు పత్తా లేకుండా పోవడం దారుణమని అన్నారు. వీరి ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు దర్గాయి హరిప్రసాద్, కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు మంద ప్రవీణ్, ఏడు మేకల మహేష్ యాదవ్, వడిచర్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.

తరచు వార్తల్లో ఏరియా ఆసుపత్రి..

గతంలో కూడా జిల్లా కేంద్రంలో శస్త్ర చికిత్స చేయించుకున్న కొంతమంది మహిళలకు కుట్లు వేసిన చోట విడిపోయి ఇన్ఫెక్షన్ వచిందని ఆవేదన వ్యక్తం చేసారు. మరి కొంత మంది ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి భయపడి ఆసుపత్రి నుంచి బయటికి వెళ్ళిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వలనే మహిళలకు ఇన్ఫెక్షన్ అయిందని అప్పట్లో పలువురు ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించగా.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని పేర్కొ్న్నారు. ఇన్ని ఆరోపణలు వస్తూ తరచు వార్తల్లో నిలుస్తున్న ఏరియా ఆసుపత్రి పట్ల అధికారులు ఎవరు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి చర్యలు పునరావృతం అవున్నాయని.. ఇప్పటికైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యుల పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story