వేసవిలో 'సబ్జా' సత్తువ.. ఎన్ని లాభాలో..

by samatah |   ( Updated:2022-03-13 07:44:10.0  )
వేసవిలో సబ్జా సత్తువ.. ఎన్ని లాభాలో..
X

దిశ, ఫీచర్స్ : మార్చి తొలి వారంలోనే భానుడి ప్రతాపం ప్రారంభం కాగా.. ఇప్పటినుంచే శరీరాన్ని చల్లబరిచే ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ద్రవ పానీయాలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉక్కపోత కారణంగా ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరదు. దీంతో చాలామంది కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. వీటికి బదులు సబ్జా గింజలతో కూడిన పానీయాలను తీసుకుంటే ఆరోగ్యానికి , శరీరానికి ప్రయోజనం కలుగుతుంది. ఆఫీసుల్లో ఉన్నా, ప్రయాణ సమయాల్లో అయినా దాహం తీర్చడంలో సబ్జా గింజలు ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. వేసవి తాపాన్ని తగ్గించే సబ్జా గింజల్లో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలెన్నో.

నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడటంతో పాటు, శరీరంలోని తేమ స్థాయిని తగ్గిపోకుండా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. వడదెబ్బ నుంచి కాపాడుతాయి. వేసవిలోనే కాదు, సబ్జా గింజల ప్రయోజనాలు గుర్తించిన జ్యూస్, టీ స్టాల్ ఓనర్స్ అన్ని పానీయాల్లోనూ వీటిని చేరుస్తున్నారు. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి.

* సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు అవసరమైన 'ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఈ' వంటి పోషకాలు లభిస్తాయి.

* వీటిలో ఉండే ఐరన్, విటమిన్ కె, ప్రొటీన్‌లు ఆరోగ్యకరమైన జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అలాగే, వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తాయి.

*ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA), ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికమొత్తంలో ఉండడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించి జీవక్రియను మెరుగుపరుస్తాయి. అధిక బరువును తగ్గించడంలోనూ సాయపడతాయి.

* ఫైబర్ కూడా సమృద్ధిగా ఉండటంతో కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి.

* ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది.

* ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొత్త చర్మ కణాలను రూపొందించేందుకు అవసరమైన కొల్లాజెన్‌ను స్రవించేందుకు శరీరానికి సహకరిస్తుంది.

* దగ్గు, జలుబును నయం చేయడంలోనూ ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.

* వీటి యాంటిస్పాస్మోడిక్ లక్షణం కారణంగా స్పాస్మోడిక్ కండరాలకు ఉపశమనం అందించడమే కాకుండా అవి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. యాంటిస్పాస్మోడిక్ లక్షణం కోరింత దగ్గును నియంత్రించడంలోనూ దోహదపడుతుంది.

* రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా ఉపకారిగా ఉంటుంది.

సూచన :

పిల్లలు, గర్భిణీ స్త్రీలతో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు వైద్యుల సూచన మేరకు మాత్రమే సబ్జా గింజలను తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed