జెట్ ఎయిర్‌వేస్ కొత్త సీఈఓగా సంజీవ్ కపూర్!

by Harish |
జెట్ ఎయిర్‌వేస్ కొత్త సీఈఓగా సంజీవ్ కపూర్!
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో పునరుద్ధరించనున్న ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు నూతన సీనియర్ మేనేజ్‌మెంట్‌ను నియమించే పనిని కొత్త ప్రమోటర్ కల్‌రాక్ జలాన్ కన్సార్టియం ప్రారంభించింది. తాజాగా విమానయాన రంగంలో అనుభవం ఉన్న సంజీవ్ కపూర్‌ను జెట్ ఎయిర్‌వేస్ కొత్త సీఈఓగా నియమిస్తున్నట్టు సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు పునఃప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. అదే నెలలో 4వ తేదీ నుంచి సంజీవ్ కపూర్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం సంజీవ్ కపూర్ ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతకుముందు ఆయన 2016-2019 మధ్య విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ ఆఫీసర్ హోదాలో పనిచేశారు. ఆ పదవిలో ఉన్న కాలంలో విస్తారాకు సంబంధించి ఆదాయం, మార్కెటింగ్, గ్రౌండ్ సర్వీసెస్, ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ సహా అన్ని రకాల విధులను పర్యవేక్షించారు. అంతేకాకుండా గోఎయిర్, స్పైస్‌జెట్ విమానయాన సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. విమానయాన రంగంలో సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న సంజీవ్ కపూర్, ఆసియా, ఐరోపా, అమెరికాలో ఉన్న కంపెనీల్లో వివిధ హోదాల్లో బాధ్యతలను నిర్వర్తించారు. కాగా, జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఇటీవలే భారత ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన కెప్టెన్ వీపీ సింగ్‌ను అకౌంటబుల్ ఆఫీసర్‌గా, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విపుల గుణతిలకను సీఎఫ్ఓగా నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story