ఉగ్రవాద నియంత్రణలో సీఆర్పీఎఫ్ భేష్.. జమ్మూకాశ్మీర్‌లో బలగాల ఉపసంహరణ

by Javid Pasha |
ఉగ్రవాద నియంత్రణలో సీఆర్పీఎఫ్ భేష్.. జమ్మూకాశ్మీర్‌లో బలగాల ఉపసంహరణ
X

శ్రీనగర్ : ఉగ్రవాదంపై పోరులో దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అందిస్తున్న సేవలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు. శనివారం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగిన సీఆర్పీఎఫ్ 83వ రైజింగ్ డే పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రానున్న కొన్నేళ్లలో జమ్మూ-కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ దళాల మోహరింపును తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాశ్మీర్, నక్సల్ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన ఈ మూడు ప్రాంతాల్లో పూర్తి శాంతి నెలకొనే అవకాశం ఉందని వెల్లడించారు. అదే జరిగితే ఆ క్రెడిట్ మొత్తం సీఆర్పీఎఫ్ బలగాలగే చెందుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ భారీ ఉనికిని కలిగి ఉందని, ఉగ్రవాదుల దాడులను తిప్పికొడుతూ శాంతిభద్రతలను కాపాడేందుకు మొత్తం బలగాల్లో నాలుగింట ఒకవంతును మోహరించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటే జమ్మూ-కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. జమ్మూ-కాశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై సీఆర్పీఎఫ్ 'నిర్ణయాత్మక నియంత్రణ'ను తీసుకోవడం భేష్ అని కేంద్ర హోంమంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed