కాంగ్రెస్ టికెట్ రేసులో ఉద్యోగ సంఘం నేత?

by GSrikanth |
కాంగ్రెస్ టికెట్ రేసులో ఉద్యోగ సంఘం నేత?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల వార్తలు విస్తృతం కావడంతో కాంగ్రెస్ అశావహులు టికెట్ కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరంచేశారు. జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల మార్పుపై స్పష్టత లేకపోయినప్పటికీ మిగితా పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి టికెట్లను దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. జిల్లాకు చెందిన ఓ ఉద్యోగ సంఘం నేత ఆర్మూర్ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. ఎవరి నోట విన్నా ముందస్తు మాటే అంటుండటంతో సదరు ఉద్యోగ సంఘం నేత ముందు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది.

ఈనెల మూడో వారంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రితో ఆర్మూర్ అసెంబ్లీ స్థానం టికెట్ కోసం చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. తన సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నేతతో, మరో పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేతో కలిసి మంత్రితో మంతనాలు సాగించడం విశేషం. ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే జిల్లాలో చర్చల మీద చర్చలు, సర్వేల మీద సర్వేలు జరుగుతుండగా ముందుగానే బెర్త్ ఖరారు చేసుకునేందుకు ఉద్యోగ సంఘం నేత ప్రయత్నాలు చేయడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న మాజీ ఎమ్మెల్యేకు ఎన్నికల్లో ఆర్థికంగా భరోసా కల్పిస్తానని చర్చలకు కలిసి వెళ్లినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘం నేత, మరో ఇద్దరు నాయకులు కలిసి ఒకే కారులో మాజీ మంత్రితో చర్చలకు రహాస్యంగా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీకి కరువయ్యారు.

ఈ నేపథ్యంలోనే అక్కడ సేఫ్‌గా ఉంటుందని ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఎంచుకుని పావులు కదపడం విశేషం. ఉద్యోగ సంఘం నేతగా చక్రం తిప్పిన అనుభవంతో ఎన్నికల్లో తన లక్‌ను పరీక్షించుకునేందుకు ఎన్నికలకు ముందుగానే ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఊహగానాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో అతి చిన్న నియోజకవర్గంగా పేరున్న ఆర్మూర్ అయితే తన రాజకీయ ఆరంగేట్రానికి సురక్షితంగా ఉంటుందని ఆర్మూర్ సీటు కోసం ఫోకస్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రమని అందులో ఏదైనా జరుగొచ్చని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వరకు అభ్యర్థుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్‌తో ముడిపడి ఉన్న నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై ముద్ర వేసిన మాజీ మంత్రితో టికెట్ల కోసం మంతనాలు జరుపడం ముందస్తుకు సూచనలే అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Advertisement

Next Story