ఖాతాదారుడి ఖాతా ఖాళీ చేసిన బ్యాంక్ ఉద్యోగి

by Vinod kumar |   ( Updated:2022-04-08 16:19:46.0  )
ఖాతాదారుడి ఖాతా ఖాళీ చేసిన బ్యాంక్ ఉద్యోగి
X

దిశ, సికింద్రాబాద్: ఖాతాదారురాలి ఖాతా నుండి బ్యాంకు ఉద్యోగి రూ.51 లక్షలకు పైగా కాజేసిన ఘటన సికింద్రాబాద్ ఈస్ట్ మారేడు పల్లిలోని ఎస్బీఐలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సపిఫ్ గూడకు చెందిన అనసూయ(80)కు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. కుమారుడు ఏఎస్ రావు నగర్ లో ఉండగా, కూతురు కూకట్ పల్లి లో ఉంటారు. వృద్ధురాలు ఒంటరిగా సఫీల్ గూడాలో నివాసం ఉంటుంది. ఆమెకు ఈస్ట్ మారేడ్ పల్లి లోని ఎస్బీఐ బ్యాంక్ లో ఖాతా ఉంది. తన ఖాతాలో కొన్నేళ్ల క్రితం రూ.48 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. దీంతో పాటు రూ.3లక్షలకు పైగా నగదు ఉంది. బ్యాంక్ కు వచ్చి అప్పుడప్పుడు తన అవసర నిమిత్తం నగదు డ్రా చేసుకుని వెళ్ళేది. బ్యాంక్ లో తరచూ శశి కుమార్ అనే ఉద్యోగి సహయంతో నగదు విత్ డ్రా చేసుకునేది.


ఆమె ఒంటరిగా ఉంటుందని గమనించిన బ్యాంక్ ఉద్యోగి ఆమె అకౌంట్ లో నుండి విడతల వారీగా నగదును వేరొక ఖాతాకు మరలించాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న వృద్దురాలు సంబంధిత బ్యాంకుకు వెళ్లి మొర పెట్టుకోగా బ్యాంకు వారి నుండి స్పందన రాలేదు. చేసేదేమీలేక సంబంధిత తుకారం గేట్ పోలీసులను ఆశ్రయించగా అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. 2 గంటలు వేచి ఉన్న వృద్ధురాలు ఫిర్యాదును స్వీకరించేందుకు ఎస్ఐ వెంకటాద్రి నిరాకరించారని బాధితురాలు ఆరోపించింది. చేసేదేమి లేక తన కూతురు పద్మ సహాయంతో నార్త్ జోన్ డీసీపీ ని, ఏసీపీ సుధీర్ ను ఆశ్రయించాగా బాధితురాలికి న్యాయం చేస్తానని డీసీపీ హామీ ఇచ్చారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని తుకారం గేట్ పోలీసులుకు ఆమె ఆదేశించారు. తుకారాం గేట్ డీఐ ఆంజనేయులు వెంటనే డీసీపీ ఆఫీస్ కు చేరుకొని బాధితురాలు నుంచి ఫిర్యాదు స్వీకరించారు. బ్యాంక్ ఉద్యోగి శశితో పాటు మరికొందరు కూడా బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఉండవచ్చునని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని వేడుకొంది. తుకారాం గేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed