పోలీసు ఫ్రీ కోచింగ్‌కు అపూర్వ స్పందన.. స్క్రీనింగ్ టెస్ట్‌కు 3527 మంది

by Javid Pasha |
పోలీసు ఫ్రీ కోచింగ్‌కు అపూర్వ స్పందన.. స్క్రీనింగ్ టెస్ట్‌కు 3527 మంది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ, పబ్లిక్ పరీక్షలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల నిర్వహణ సమయంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరీక్ష కేంద్రాలను తమ ఆధీనంలో ఉంచుకుని ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా వారు చేసే సేవలు చాలా గొప్పవి. కానీ వారు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లి విద్యార్థులను లేదా అభ్యర్థులను తనిఖీ చేయడం మాత్రం సాధ్యం కాదు. పబ్లిక్ పరీక్షల వేళ హైపవర్ కమిటీలో పోలీసు అధికారులు ఉన్నా తనిఖీలలో వారి సేవలు నామమాత్రం. కానీ పోలీసు ఉద్యోగాల కొరకు ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ అద్భుతమైన దృశ్యాలకు వేదికైంది.

పోలీసు అధికారులు కేవలం బందోబస్తుకే పరిమితం కాకుండా ఇన్విజిలేటర్లు, అధికారుల మాదిరిగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడంతో పాటు స్క్రీనింగ్ టెస్టును సజావుగా జరిపేందుకు చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 14 పరీక్ష కేంద్రాలలో పోలీసు కానిస్టేబుల్ మొదలు ఎస్సైల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు అన్నీ తానై వ్యవహరించి స్క్రీనింగ్ టెస్టును సక్సెస్‌గా నిర్వహించారు.


నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 14 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్క్రీనింగ్ టెస్టును (రాత పరీక్ష)ను నిర్వహించారు. 14 పరీక్ష కేంద్రాల్లో ఈ టెస్ట్ కొరకు 6094 మంది దరఖాస్తు చేసుకోగా 3527 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2567 మంది గైర్హాజరయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంలో రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బంది కలుగకూడదని నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ లో హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, త్వరలోనే ఫలితాలను వెల్లడించి ఫ్రీ కోచింగ్‌ను ప్రారంభిస్తామని సీపీ నాగరాజు తెలిపారు.

నిజామాబాద్ పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు 14 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్ ) డా.వినీత్, అదనపు డీసీపీ (ఆపరేషన్) నరేందర్ రెడ్డి, ఏసీపీలు వెంకటేశ్వర్లు, రామారావు, ప్రభాకర్ రావు, సంతోష్ లతో పాటు 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 150 మంది పోలీసు సిబ్బంది, 400 మంది టీచర్లు, పోలీసు శాఖకు చెందిన ఐటీ సెల్ పర్యవేక్షణలో స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా జరిగింది.

Advertisement

Next Story

Most Viewed