డీపీఆర్‌లు ఇస్తాం..తెలుగు రాష్ట్రాలు స్పష్టం

by Shyam |   ( Updated:2020-06-04 10:53:43.0  )
డీపీఆర్‌లు ఇస్తాం..తెలుగు రాష్ట్రాలు స్పష్టం
X

దిశ, న్యూస్ బ్యూరో: కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు అంగీకరించాయని కృష్ణాబోర్డు ఛైర్మన్ పరమేశం తెలిపారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశామన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం గురువారం జలసౌధలో జరిగింది. దాదాపు 6గంటలకు పైగా సాగిన సమావేశంలో చర్చించిన అంశాలను బోర్డు ఛైర్మన్ పరమేశం వివరించారు. ప్రధానంగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు సూచించామని, ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకుని ఇస్తామని అంగీకరించాయన్నారు. పూర్తి డీపీఆర్‌లు ఇచ్చే వరకు రాయలసీమ ఎత్తిపోత పథకం పనులు చేసేందుకు వీల్లేదని ఏపీకి చెప్పామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతర తెలుపడంతో బోర్డు కూడా నోటీసులు జారీ చేసిందని, దీనిపై కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ వాటర్ ఇయర్‌లో కూడా కృష్ణా జలాలను వినియోగించుకునే అంశంపై నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణ 34, ఏపీ 66 నిష్పత్తిలో జలాలను వాడుకుంటాయన్నారు. అదే విధంగా శ్రీశైలం నుంచి 50 :50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని పరమేశం వెల్లడించారు. వరద సమయంలో ఉపయోగించిన జలాల అంశాలను కమిటీ పరిశీలిస్తోందన్నారు. రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యంశంగా పరిగణించి అమలు చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని, త్వరలోనే 9 ప్రాంతాల్లో టెలిమెట్రీని ఏర్పాటు చేస్తామన్నారు. తాగునీటి వినియోగంపై 20శాతమే లెక్కింపుపై కేంద్ర జల సంఘానికి నివేదించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పరమేశం వెల్లడించారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా నష్టాలు ఉంటున్నాయని బోర్డుకు తెలిపారని, దీనిపై పరిశీలిస్తామన్నారు. గోదావరి, కృష్ణా డైవర్సన్‌లో భాగంగా 80టీఎంసీలను డైవర్ట్ చేసినపపుడు 45 శాతం ఉమ్మడి రాష్ట్రానికి రావాల్సి ఉందని, వీటి పంపకాలపై కేంద్రానికి నివేదిస్తున్నామన్నారు. బోర్డును విజయవాడ తరలించాలని ఏపీ అధికారులు సూచించారని, దీనిపై కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని పరమేశం తెలిపారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు పాత పద్ధతిలోనే నీటి వాటా కేటాయింపులు చేశామని, వరద వచ్చినప్పుడు పరిస్థితులను చూసి మరోసారి సమావేశమై నీటి వాటాపై చర్చిస్తామన్నారు.

మీ హయాంలోనే జీవోలు జారీ..

కృష్ణా బోర్డు సమావేశం సుదీర్ఘంగా..వాడీవేడిగా సాగింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లు తమ వాదనలు వినిపించారు. తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు రజత్ కుమార్, ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీలు పలు అంశాలపై పట్టుబట్టారు. ప్రధానంగా కొత్త ప్రాజెక్టులపైనే బోర్డు సమావేశంలో ముందు చర్చకు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు లేవని, ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ హయాంలోనే ఇప్పుడు చేపట్టుతున్న ప్రాజెక్టులకు జీవోలు జారీ చేశారని రజత్ కుమార్ చెప్పారు. అంతేకాకుండా ప్రధాని మోడీ మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టులపై ప్రసంగించారని, పెండింగ్ ప్రాజెక్టుగా చెప్పారంటూ తెలంగాణ ప్రెజంటేషన్ చేసింది. డిండి కూడా పాత ప్రాజెక్టు అని, కొంత రీ డిజైన్ చేశారని వెల్లడించింది. తుమ్మిళ్ల లిఫ్ట్‌‌తో ఆర్టీఎస్ నీటిని వాడుకుంటున్నామని వివరించింది. రాయలసీమ ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపు కొత్తగా చేపట్టుతున్నారని, విభజన తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. దీంతో ఏపీ తరుపున ఆదిత్యనాథ్ దాస్ సమాధానమిస్తూ పాత ప్రాజెక్టులే అయినా రీ డిజైన్ చేశారని, వాటికి సంబంధించిన డీపీఆర్‌లు మొత్తం ఇవ్వాల్సిందేనన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ వాటాకు లోబడే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని డీపీఆర్‌లు ఇస్తామన్నారు. ఈసారి తెలంగాణ వాటాలో 37 శాతం పెంచాలని, ఏపీకి 63 శాతం ఉండాలని తెలంగాణ తరుపున రజత్ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై వరద మొదలైన తర్వాత సమావేశమై నిర్ణయం తీసుకుంటామని బోర్డు ఛైర్మన్ సమాధానమిచ్చారు. టెలిమెట్రీ ఏర్పాటుపై బోర్డు త్వరగా నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణ నుంచి రూ. 2.50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. దీనిపై ఏపీ కూడా నిధులు ఇస్తామని ప్రకటించింది. విజయవాడకు బోర్డు తరలింపు అనవసరమని, ప్రస్తుతం ఏపీకి రాజధాని సిద్ధం కాలేదని, ఈ పరిస్థితుల్లో తరలించవద్దని సూచించారు.

హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 16.5 టీఎంసీలు రావాలి..

కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌ ఇచ్చామని రజత్‌ కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు. 16.5 టీఎంసీలు హైదరాబాద్‌కు రావాలనే విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తాగునీటి కేటాయంపులను 20 శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించి ఆ మేరకు అదనపు జలాలను ఇవ్వాలని కోరినట్లు రజత్‌ కుమార్‌ చెప్పారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్‌ అంశాల గురించి బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed