చైత్ర కుటుంబానికి సర్కార్ అండ.. మంత్రి తలసాని..

by Shyam |
చైత్ర కుటుంబానికి సర్కార్ అండ.. మంత్రి తలసాని..
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​సైదాబాద్ లోని సింగరేణి కాలనీకి చెందిన చైత్ర కుటుంబానికి సర్కార్ అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ పేర్కొన్నారు. చిన్నారిపై లైంగిక దాడి, దారుణ హత్య జరగడం బాధకరమన్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్‌లోని ఆయన కార్యాలయంలో చైత్ర తల్లిదండ్రులు సబావాత్ రాజు, జ్యోతి లకు ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు పత్రాన్ని ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9 వ తేదిన చిన్నారిపై ఒక కామాంధుడు లైంగిక దాడి చేసి, దారుణ హత్య చేసిన సంఘటన తనను ఎంతో కలిసి వేసిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టిందన్నారు. చైత్ర కుటుంబానికి తక్షణ సహాయంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 50 వేల రూపాయలను అందజేసినట్లు చెప్పారు.

సీఎం సూచనతో సెప్టెంబర్ 15 వ తేదీన హోంమంత్రి మహమూద్ అలీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ల చేతుల మీదుగా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేసినట్లు మంత్రి తెలిపారు. సైదాబాద్ లోని పిల్లి గుడిసెలు కాలనీలో ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒక ఇంటిని కేటాయిస్తూ.. మంజూరు పత్రాన్ని, ఇంటి తాళాన్ని అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, కలెక్టర్​శర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed