పరిశ్రమశాఖకు రూ.3,077 కోట్లు.. గతేడాది కంటే రూ.1078.81 కోట్లు అదనం

by Shyam |   ( Updated:2021-03-18 02:56:07.0  )
పరిశ్రమశాఖకు రూ.3,077 కోట్లు.. గతేడాది కంటే రూ.1078.81 కోట్లు అదనం
X

దిశ, తెలంగాణ బ్యూరో:రానున్న ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు ప్రభుత్వం రూ.3,077 కోట్ల కేటాయింపులు చేసింది. గతేడాది పారిశ్రామిక రంగానికి 1998.19 కోట్లు మాత్రమే. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.1078.81 కోట్లు అదనం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక ఊతం కల్పించేందుకు ప్రస్తుతం అమలవుతున్న ‘టీఎస్ ప్రైడ్’ పథకం కింద ఈసారి పావలా వడ్డీ రుణాలు, విద్యుత్ రాయితీలు, సబ్సిడీని 35 శాతం నుంచి 45 శాతానికి పెంపు తదితరాలను ప్రతిపాదించింది. వాణిజ్య పన్ను మినహాయింపును 100 శాతానికి పెంచింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ పరిశ్రమల స్థాపన కోసం 39,590 యూనిట్లను 1,919 కోట్ల రూపాయల సబ్సిడీతో మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

సులభతర వాణిజ్య విధానంతో పరిశ్రమలకు త్వరితగిన అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న మంత్రి హరీశ్‌రావు గడచిన ఆరేళ్ళలో ‘టీఎస్ ఐపాస్’ విధానం ద్వారా 15,252 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని, సుమారు రూ. 2.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 15.51 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఫార్మారంగంలో జాతీయ ఎగుమతులతో దాదాపు 14 శాతం తెలంగాణ రాష్ట్రం నుంచే వున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీల్లో 3వ వంతు కంపెనీలు హైదరాబాద్‌లో నెలకొన్నాయని, కరోనా పరిస్థితుల్లో హైదరాబాద్ ఫార్మా రంగం మొత్తం ప్రపంచానికే ఎలాంటి సహకారం అందిస్తూ ఉందో స్పష్టమైందని ఉదహరించారు. పరిశ్రమల రాయితీల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 2,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించారు.

Advertisement

Next Story

Most Viewed