నారాయణపురం మండలంలో వింత.. ఇండ్లకు పట్టా పాస్ పుస్తకాలు జారి!

by Mahesh |
నారాయణపురం మండలంలో వింత.. ఇండ్లకు పట్టా పాస్ పుస్తకాలు జారి!
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలకు సామాన్యులు బలికాక తప్పడం లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట రెవెన్యూ అధికారులు చేసిన పొరపాట్లతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ సమస్య పరిష్కారం కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి . ఇలాంటి సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 300 లో చోటుచేసుకుంది. సర్వే నెంబర్ 300 పూర్తి విస్తీర్ణం 8 ఎకరాల తొమ్మిది గుంటలు కాగా అందులో రాపర్తి జంగయ్య తనకున్న ఎకరం రెండు గుంటలలో గతంలోనే ఇంటి స్థలాల కోసం స్థానికులకు విక్రయించాడు. కానీ 2013 -14 పహాని వరకు రాపర్తి జంగయ్య రికార్డులలో వచ్చిన, రికార్డుల్లో లేని మరో వ్యక్తి ధరణిలో నమోదు కావడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు.

రికార్డులలో లేని వ్యక్తి ఎలా వచ్చారు?

ధరణికి ముందు ఉన్న పహానీలలో సర్వే నెంబర్ 300 లో ఎక్కడ లేని వ్యక్తి ధరణి వెబ్‌సైట్‌ లో నమోదు అయ్యాడు. ఆర్ఎస్ఆర్ ను సరి చేస్తూ ధరణి వెబ్‌సైట్‌ వివరాలు పొందుపరిచే సమయంలోనే తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. అయితే ధరణి వెబ్‌సైట్‌ డిజిటల్ సైన్ చేసే ముందు సంబంధిత తహశీల్దార్ రెవెన్యూ అధికారులతో క్షేత్ర స్థాయి సర్వే చేయించకుండానే నూతన పట్టా పాస్ పుస్తకాన్ని జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే నూతన పట్టా పాస్ పుస్తకాన్ని పొందిన సదరు రైతు ఈ విషయం ముందే గుర్తించి ఇతరులకు అమ్మినట్లు తెలుస్తుంది. దీంతో సర్వే నెంబర్ 300 లో అప్పటికే ఇండ్ల స్థలాలను కొనుగోలు చేసిన వారు విషయం తెలుసుకొని స్థానిక తహశీల్దార్ తో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.

సర్వే నెంబర్ 300 లోనే ప్రభుత్వ పాఠశాల

మహ్మదాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 300 లో అప్పట్లో తోకల రామ్ రెడ్డి అనే వ్యక్తి 19 గుంటల భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం దానం చేశారు. అయితే ప్రస్తుతం ఆ పాఠశాల స్థలం కూడా 19 గుంటలు లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సర్వే చేసి ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని గుర్తించాల్సిన అధికారులు కూడా అటువైపు ఆలోచన చేయకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎలాంటి ఆధారాలు లేకుండా రికార్డులలో నమోదు అయిన వ్యక్తి పట్టాను రద్దు చేయడం లేదా లావాదేవీలను నిలుపుదల చేసే అధికారం ఉన్న అటువైపుగా అధికారులు ఆలోచన చేయకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బాధితులకు న్యాయం చేయకుండా ఆధారాలు లేకుండా పట్టా చేసుకున్న రైతులతో రెవెన్యూ అధికారులు కుమ్మకై సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇట్టి విషయంపై కోర్టును ఆశ్రయించాలని తహశీల్దారే స్వయంగా చెప్పడం వెనుక ఏం మర్మం దాగి ఉందనే అనుమానం వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా పట్టా పాస్ పుస్తకం పొందిన రైతు స్లాట్ బుక్ చేసుకున్న విషయం గ్రామస్తులకు తెలిసిన వెంటనే తహసీల్దార్ కు చెప్పామని అంటున్నారు. అయినా తమ మాట వినకుండా స్లాట్ బుక్ చేసుకున్నాక ఆపే అధికారం తమకు లేదని తహసీల్దార్ సమాధానం ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

రెవెన్యూ అధికారుల తప్పుతో తిప్పలు!

సర్వే నెంబర్ 300 లో ఉన్న గత పహాని ప్రకారం ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉన్న ఇతర వ్యక్తులకు నమోదు చేసి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడం తోటే ఈ సమస్య ఉత్పన్నమైంది. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1989 లో సర్వే నెంబర్ 300 ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన ఇంటి యజమానులు రిజిస్టర్ డాక్యుమెంట్ ప్రకారం ఉండాల్సిన విస్తీర్ణం లేదు. అయినా డాక్యుమెంట్ ప్రకారం ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకున్నారు. తమకు రావలసిన మిగిలిన స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రెవిన్యూ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు.

మా నాన్న 340 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు : సింగిరెడ్డి యాదిరెడ్డి

మహమ్మదాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 300 లో మా నాన్న సింగిరెడ్డి లక్ష్మారెడ్డి 340 గజాల స్థలాన్ని రాపర్తి జంగయ్య వద్ద కొనుగోలు చేశారు. మాతో పాటు చాలామంది రాపర్తి జంగయ్య వద్ద స్థలాలు కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకున్నారు. డాక్యుమెంట్లో కొనుగోలు చేసిన విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణంలోనే ఇల్లును నిర్మించుకున్నాం. అయితే ఈ సర్వే నెంబర్లో రాపర్తి జంగయ్య పేరుపై ఉండాల్సిన భూమి ధరణిలో ఇతరుల పేరు పైన వచ్చి పట్టా పాసుపుస్తకం అందిందని తెలిసింది. దీంతో ఇతరులు మిగిలిన భూమిని స్వాధీనం చేసుకున్నారు.మాకు రావాల్సిన భూమిని గ్రామ అవసరాలకు ఇచ్చేందుకు సిద్ధంగా కూడా ఉన్నాము.

ఫిర్యాదు వచ్చాక ఎలాంటి ట్రాన్సాక్షన్ జరపలేదు

మహమ్మదాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 300 లో ఇంటి ప్లాట్ల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు అనంతరం ఎలాంటి లావాదేవీలు జరపలేదు. దీనిపై కోర్టును ఆశ్రయించమని సూచించాను. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్వరలోనే సర్వే చేయించి ఇంటి స్థలాలు ఉన్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం:- ఎం,కృష్ణ, తహశీల్దార్, సంస్థాన్ నారాయణపురం

Next Story

Most Viewed