- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎస్‌పీ సెంటర్లలో అక్రమాలు.. అమాయక లబ్ధిదారులే టార్గెట్

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : కావేవి అక్రమాలకు అనర్హం అన్న చందంగా తయారయ్యాయి కస్టమర్ సర్వీస్ పాయింట్లు. లబ్ధిదారులకు సేవలు అందించాల్సిన సీఎస్‌పీ సెంటర్లు అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అమాయక లబ్ధిదారులే టార్గెట్ గా నిర్వాహకులు పెద్ద ఎత్తున దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధునిక పరికరాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. పెన్షన్ డబ్బుల పేరుతో ప్రభుత్వ పథకాల సొమ్మును స్వాహా చేసిన తంతు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఓ సీఎస్‌పీ కేంద్రంలో ఓ వృద్ధ అంధ వికలాంగులకు చెందిన పీఎం కిసాన్ యోజన డబ్బులను తన ఖాతాలో నుంచి మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పింఛన్ డబ్బుల వ్యవహారంలో గోల్ మాల్ జరగగా రికవరీ చేసినట్లు సమాచారం.
పెన్షన్ తో పాటు రైతుబంధు, పీఎం కిసాన్..
సిరిసిల్ల అర్బన్ పరిధిలోని ఓ వార్డుకు చెందిన మండల లచ్చయ్యకు కళ్లు కనిపించకపోవడం తో చాలా ఏళ్ల నుంచి అతనికి వికలాంగుల పెన్షన్ వస్తుంది. అదేవిధంగా అతనికి అదే వార్డులోని 425/4 సర్వే నెంబర్ లో ఒక ఎకరం భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి రైతుబంధు, పీఎం కిసాన్ యోజన డబ్బులు యధావిధిగా తన బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ డబ్బులను డ్రా చేసుకునేందుకు లచ్చయ్య స్థానికంగా ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్ లోకి వెళ్లి ప్రతినెలా వచ్చే పెన్షన్ తో పాటు ఏడాదికి రెండుసార్లు వచ్చే రైతుబంధు, పీఎం కిసాన్ డబ్బులు తీసుకునేవాడు.
వేలిముద్రలతో పీఎం కిసాన్ డబ్బులు స్వాహా..
అయితే లచ్చయ్య బ్యాంకు ఖాతాలో జమ అయ్యే పెన్షన్ డబ్బులు ప్రతినెలా, రైతుబంధు, పీఎం కిసాన్ యోజన డబ్బులు ఏడాదికి రెండుసార్లు స్థానిక కస్టమర్ సర్వీస్ పాయింట్ లో వేలిముద్ర ఆధారంగా తీసుకునేవాడు. అయితే గత ఐదు సంవత్సరాలుగా ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు లచ్చయ్య తీసుకోవడం లేదు. సీఎస్‌పీ నిర్వాహకులను లచ్చయ్య ఎన్నిసార్లు అడిగినా దానికి సంబంధించిన డబ్బులు ఖాతాలో జమ కాలేదని నిర్వాహకురాలు చెప్పేవారు. తన స్నేహితుని సహాయంతో బాధితుడు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాడు. సంవత్సరానికి రెండు సార్లు పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు లచ్చయ్య బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని, అవి స్థానిక కస్టమర్ సర్వీస్ పాయింట్ లో డ్రా అయ్యాయని సంబంధిత వ్యవసాయాధికారి చెప్పడంతో ఒక్కసారిగా లచ్చయ్య కంగుతిన్నాడు. తన ఐదు సంవత్సరాల పీఎం కిసాన్ యోజన డబ్బులను సీఎస్‌పీ సెంటర్ నిర్వాహకులు తన వేలిముద్ర తో తీసుకున్నట్లు తెలిసి ఆవేదన వ్యక్తం చేశాడు.
గతంలోనూ ఇదే తంతు..
ఇదిలా ఉండగా గతంలో కూడా ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలు పెన్షన్ డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది మరణించిన వారి పేరు మీద వచ్చే పెన్షన్ డబ్బులను కాజేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి నిలదీయడంతో గుట్టు చప్పుడు కాకుండా సుమారు ఒక లక్షకు పైగా తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లు సమాచారం. ఇలాగే చాలామంది అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నా డబ్బులు నాకు ఇప్పించండి : మండల లచ్చయ్య బాధితుడు
వృద్ధుడను, పైగా వికలాంగుడను అయినా నాకు సీఎస్‌పీ సెంటర్ నిర్వాహకులు అన్యాయం చేశారు. నాకు ఉన్న ఒక ఎకరం భూమికి మోదీ ఇచ్చే పైసలను ఐదేళ్లుగా వారు తీసుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నారు. పెద్ద సార్లు అందరూ స్పందించి నా డబ్బులు నాకు ఇప్పించి న్యాయం చేయాలి.