Myanmar Quake: చైనాలో భూకంపం.. చిన్నారులను కాపాడిన నర్సులు

by Shamantha N |
Myanmar Quake: చైనాలో భూకంపం.. చిన్నారులను కాపాడిన నర్సులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్‌ లో భారీ భూకంపం సంభవించింది. అయితే,ఆ ప్రభావం పొరుగు దేశాలైన థాయిలాండ్, చైనా, భారత్‌, వియత్నాం, బంగ్లాదేశ్‌లపైనా పడింది. కాగా, చైనాలోని యానాన్‌ ప్రావిన్స్‌లోని చిల్డ్రన్ హాస్పిటల్ లో ఒక్కసారిగా భూప్రకంపనలు వచ్చాయి. ఆటైంలో నవజాత శిశువులను కాపాడేందుకు నర్సులు చేసిన సాహసం సీసీటీవీ వీడియోలో ఆ విజువల్స్ రికార్డయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవజాత శిశువుల వార్డులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ప్రకంపనలు తీవ్రం అవుతున్నా.. సిబ్బంది అక్కడి నుంచి భయంతో పారిపోకుండా శిశువులను కాపాడడానికి ప్రయత్నించారు. ప్రకంపనల తీవ్రతతో ఆ వార్డులోని బేబీ బెడ్‌లు చెల్లాచెదురయ్యాయి. అక్కడే ఉన్న సిబ్బందిలో ఒకరు నేలపై కూర్చుని ఒక చేత్తో శిశువును ఎత్తుకుని.. మరో చేత్తో ఇతర బెడ్లనుంచి చిన్నారులు పడిపోకుండా జాగ్రత్తపడ్డారు. అదే సమయంలో మరో నర్స్‌.. అటు ఇటు కదులుతున్న బేబీ బెడ్లను పట్టుకుని ఉండిపోయారు. భూ ప్రకంపనలకు అక్కడి వాటర్ ఫిల్టర్ పడిపోయింది. నేలంతా నీటిమయం అయ్యింది. అయినప్పటికీ, చిన్నారులను కాపాడేందుకు నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

నెటిజన్ల ప్రశంసలు

కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు నర్సులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంక్షోభం సమయంలో చిన్నారులను రక్షించాలనే వారి సంకల్పాన్ని చూస్తే హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఓకేసారి భయంకరమైన, అందమైన క్షణాలు చూస్తున్నాం.. నర్సులు అసలైన హీరోలు అని మరొకరు రాసుకొచ్చారు. మరోవైపు, మయన్మార్‌లో శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 1,644 మంది మరణించగా, 3,400 మందికి పైగా గాయపడ్డారు.

Next Story

Most Viewed