జీవై ఫౌండేషన్ సేవలు ఎంతో ఉపయోగకరం : దత్తాత్రేయ

by Shyam |
జీవై ఫౌండేషన్ సేవలు ఎంతో ఉపయోగకరం : దత్తాత్రేయ
X

దిశ, శేరిలింగంపల్లి : ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మరోసారి ప్రపంచానికి అర్ధమయ్యేలా కరోనా చూపిందన్నారు హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ. శేరిలింగంపల్లి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గజ్జల యోగానంద్ ఆధ్వర్యంలో జీవై ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆరోగ్యమిత్ర టెలీమెడిసిన్ సేవలను దత్తాత్రేయ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు అనేవారు పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేయాలి, ప్రజలకు సేవలు చేయాలని, అలాంటి వారే జనాల్లో గుర్తింపు పొందుతారని, వారిలో జీవై ఫౌండేషన్ చైర్మన్ యోగానంద్ ఒకరన్నారు. రోజుకు ఒక గంట వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని ఆ దిశగా ప్రతీ ఒక్కరు ప్రయత్నించాలన్నారు. టెక్నాలజీ ద్వారా వైద్య సేవలు అందించేందుకు టెలీ మెడిసిన్ ఒక చక్కని పరిష్కారమని, పేదలకు వైద్య సేవలు ఖరీదుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో జీవై ఫౌండేషన్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు దత్తాత్రేయ. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్రం పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తుందని, ఆలస్యంగా అయినా తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌లో చేరడం హర్షించదగ్గ విషయమన్నారు.

బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్, జీవై ఫౌండర్ యోగానంద్ మాట్లాడుతూ.. పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఈ టెలీ మెడిసిన్ ను అందుబాటులోకి తెచ్చామని దీని ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిని మనం ఎంచుకున్న నిపుణులైన డాక్టర్లకు చూయించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ ఆరోగ్యమిత్ర టెలీమెడిసిన్ సేవల కోసం నమోదు చేసుకున్నవారు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సేవలు పొందవచ్చని, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి గాను నిపుణులైన వైద్యుల సలహాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనుష్ ఇంఛార్జ్ డీఎస్ ఎన్ మూర్తి, విన్ హాస్పటల్ ఎండీ వినాయక్ కిషన్ పంపాటి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యడు జనార్దన్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story