టెలికాం డాటా.. లాభాల బాట!

by Shyam |   ( Updated:2020-04-12 01:54:28.0  )
టెలికాం డాటా.. లాభాల బాట!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి వల్ల అనేక రంగాలు నష్టాలను చూడక తప్పదని తెలుస్తోంది. అయితే, కొన్ని రంగాలు మాత్రం ఇదివరకటి కంటే మంచి లాభాలను మూటగట్టుకుంటాయని తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా ఫార్మా అయితే, రెండోది టెలికాం రంగం. ఎందుకంటే, దేశవ్యాప్తంగా అన్ని రకాల కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించడంతో డాటా వినియోగం విపరీతంగా పెరిగింది. గత నెలతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టెలికాం సంస్థల ఆదాయం ఏకంగా 15 శాతం వృద్ధి సాధించినట్టు సంస్థలు చెబుతున్నాయి. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 15 శాతం వృద్ధి గణనీయమైనదని టెలికాం సంస్థలు తెలిపాయి.

సుమారు 80 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం వల్ల డాటా వినియోగం భారీగా పెరుగుదలను నమోదు చేసింది. ప్రధాన టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, జియో, ఎయిర్‌టెల్ సంస్థలు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే చివరి త్రైమాసికంలో వినియోగదారుడి నుంచి సంస్థకు వచ్చిన సగటు ఆదాయం రూ. 124 నుంచి రూ. 145 కు పెరిగిందని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశవ్యాప్తంగా అనేక సంస్థలు లాక్‌డౌన్ వల్ల ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుంచే వారు పని చేయాల్సి రావడంతో డాటాకు డిమాండ్ భారీగా పెరిగింది. గతం కంటే మార్చి నెల తర్వాత డాటాకు 30 శాతం వరకూ డిమాండ్ పెరగడాన్ని గమనిస్తే పరిస్థితి అవగతమవుతుంది. సాధారణంగా ఒక నెలలో సగటున 25 లక్షల వరకూ కొత్త వినియోగదారులు చేరుతుంటారు. మార్చి నెలలో లాక్‌డౌన్ వంటి పరిణామాలతో 5 లక్షల మంది మాత్రమే నమోదైనప్పటికీ సంస్థల ఆదాయం మాత్రం 15 శాతం పెరగడం గమనార్హం అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. అయితే, కరోనా ప్రభావం వల్ల వినియోగదారులకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు సుమారు రూ. 500 కోట్ల వరకూ డాటా, టాక్‌టైమ్ ఉచితంగా టెలికాం సంస్థలు అందించాయి. అయినా కూడా ఆదాయం పెరిగిందని, లేకుంటే మరింత ఆదాయాన్ని ఉండేదని సంస్థలు అభిప్రాయపడ్డాయి.

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడం వల్ల కేంద్రం లాక్‌డౌన్ పొడిగిస్తే గనక పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని, విద్యా రంగంలో స్కూళ్లు, కొన్ని కాలేజీలు ఈ-క్లాసులను కొనసాగించే అవకాశాలున్నాయని, అలా జరిగితే ఈ ఏడాదిలోపు టెలికాం సంస్థలు మరో 14-15 శాతం వృద్ధిని సాధించవచ్చని సీఓఏఐ స్పష్టం చేసింది. పరిస్థితులు అనుకూలించక లాక్‌డౌన్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారితే ఫోన్ నిత్యాసవసరంగా మారినందున వినియోగదారుల సంఖ్యలో మార్పు ఉండబోదని తెలుస్తోంది. లాక్‌డౌన్ తీసేసినా డాటా వినియోగంసాధారణ స్థితికి చేరుతుంది కానీ తగ్గదని సీఓఏఐ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం రూ. 145 నుంచి రూ. 180 కి పెరిగే అవకాశముందని సీవోఏఐ అంచనా వేసింది. వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత టారిఫ్ ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం రూ. 200 లక్ష్యానికి చేరువవుతుందని సీవోఏఐ చెబుతోంది.

Tags : Telecom industry, telcos revenue, airtel, vodafone idea, coronavirus, covid-19, lockdown, COAI, jio, telecom companies

Advertisement

Next Story

Most Viewed