ఆ యూనివర్సిటీలో అసలేం జరుగుతోంది..?

by Shyam |
ఆ యూనివర్సిటీలో అసలేం జరుగుతోంది..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో మూడో అతిపెద్ద విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన తెలంగాణ యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ దాదాపు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలతో పాటు జిల్లాలోని యూనివర్సిటీ వైస్ ​చాన్స్​లర్​ ఎంపికను సెర్చ్ కమిటీ ఓ కొలిక్కి తీసుకువస్తోంది. ఈ తరుణంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో విశ్వవిద్యాలయం పరువు బజారున పడుతోంది. సెర్చ్ కమిటీ వీసీ పదవికి ముగ్గురు పేర్లను ప్రతిపాదించగా అందుకు ప్రభుత్వం, గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే రేపోమాపో కొత్త వీసీ వస్తారు. ఈ సమయంలోనే యూనివర్సిటీ అధికారులు హడావిడి నిర్ణయాలు తీసుకోవడంలో అంతర్యం ఏంటనే అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీకి ఇన్​చార్జి వీసీగా నీతూ ప్రసాద్ (ఐఏఎస్) వ్యవహరిస్తున్నారు. అసలు పాలకవర్గం సమావేశాలను ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకోకుండా అర్జంట్ అంటూ వీసీ ద్వారా మొక్కుబడిగా కొన్ని, అసలు సంబంధం లేకుండానే మరికొన్ని తీసుకున్న నిర్ణయాలతో అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుందోననే అనుమానాలు మొదలయ్యాయి. కొందరు కోటరీగా ఏర్పడి విశ్వవిద్యాలయంలో తాము చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించడం, అందుకు యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలూ దోహదం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

బీఈడీ కళాశాలల విషయంలో..

ఇటీవల విశ్వ విద్యాలయ పరిధిలోని ఐదు బీఈడీ కళాశాలలకు అనుమతి విషయంలో అకాడమిక్​అడిట్ సెల్ నిర్వాకం వల్ల నవ్వుల పాలయింది. అమ్యామ్యాలు తీసుకుని గుడ్డిగా అనుమతులకు ఏఐసీటీఈకి సిఫారసు చేయగా వారు తిరస్కరించారని, దీంతో యూనివర్సిటీ పరువు గంగలో కలినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీసీ ఎంపిక ఖరారు తరువాత కొత్తగా జరిగిన నిర్ణయాలన్నీ వీసీ ద్వారా జరుగడం గమనార్హం. విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన పదవుల పందేరం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. వివిధ విభాగాల అధిపతుల నియమాకం అంతా కుడా గప్​చుప్​గా జరిగిపోయింది. అసిస్టెంట్ కంట్రోలర్ల నియమాకం కుడా అందులో భాగమేనని చెప్పవచ్చు. డిసెంబర్ లో యూనివర్సిటీలో కొందరికి పదోన్నతులను కల్పించగా, మళ్లీ ఇప్పుడు పదోన్నతుల కోసం ఫైల్​అప్రూవల్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల వ్యవధిలో విశ్వ విద్యాలయంలో ప్రమోషన్ లను ఇవ్వడానికి గల కారణాలు ఏంటనే విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు.

వీసీ ఎంపిక ఖరారు నేపథ్యంలో హడావిడి నిర్ణయాలు..

రాష్ర్టంలో యూనివర్సిటీలకు వీసీల ఎంపిక దాదాఫు ఖరారైంది. ఫైనల్ జాబితా ప్రభుత్వం వద్దకు ఉండగా, వచ్చే వారం కొత్త వీసీ రావడం, విధుల్లో చేరడం లాంఛనమే. అయితే కొత్త వీసీ వస్తే పాలకవర్గంలో తాముంటామో లేదోనన్న సందేహాలతో ప్రస్తుత అధికారులు హడావిడి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు కోటరీగా ఏర్పడి తాము చేయాలనుకున్న పనులను వీసీ రాక ముందే చక్కబెట్టుకుంటున్నారని, అందుకు అధికారులను పావులుగా వాడుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. విశ్వ విద్యాలయంలో పనిచేసే అధికారుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాలను బేరీజు వేసుకుని ఈ తతంగం అంతా నడిపిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. తెలంగాణ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న వివాదాస్పద నిర్ణయాలు గురించి తెలిసిన విద్యార్థి సంఘాలు నోరుమెదపకపోవడం వెనుక ఒప్పందాలు కారణమనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. విద్యార్థి సంఘాల నేతలుగా యూనివర్సిటీలో తిష్టవేసిన కొందరు ముదుర్లు అంతా తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నారనే తెలుస్తోంది. తెలంగాణ విశ్వ విద్యాలయాలనికి రెగ్యూలర్ వీసీ లేక పాలన యంత్రాంగం అంతా భ్రష్టుపట్టిపోయిందని చెప్పవచ్చు. మరి కొత్త వీసీ హయాంలోనైనా విశ్వవిద్యాలయం తీరు గాడిన పడుతుందో లేదో చూడాలి మరి.

Advertisement

Next Story