- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన గుగులోత్ సౌమ్య..
దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడ ఫుట్‌బాల్. అంతర్జాతీయ వేదికల్లో ఫుట్‌బాల్ పరంగా టీమ్ ఇండియా ప్రాతినిథ్యం తక్కువే. అయితే గత కొన్నేళ్లుగా ఇండియాలో క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతున్నది. జాతీయ జట్టులో బైచింగ్ భూటియా, సునిల్ ఛత్రీ వంటి ఫుట్‌బాల్ ఆటగాళ్లు క్రికెటర్లతో సమానంగా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. కానీ, మహిళల ఫుట్‌బాల్ జట్టులో మాత్రం ఎవరెవరు ఉన్నారనే విషయం కూడా ఎవరికీ తెలియదు. భారత మహిళ ఫుట్‌బాల్ టీమ్ పాతికేళ్లుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నది. అయితే ఆ జట్టులో బెంగాల్, ముంబయి, కేరళ ప్రాంతాలకు చెందిన క్రీడాకారిణులే ఎక్కువగా ఉంటున్నారు. తొలి సారిగా ఒక తెలుగమ్మాయి.. అందులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి జాతీయ జట్టులో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది.
ఎవరీ సౌమ్య?
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లికృష్ణ తండాకు చెందిన గుగులోత్ గోపీ, ధనలక్ష్మిల సంతానమే సౌమ్య నాయక్. చిన్నతనం నుంచే రన్నింగ్‌లో మంచి ప్రతిభ కనపరిచిన సౌమ్య అనేక సార్లు పతకాలు గెల్చుకున్నది. పాఠశాల స్థాయిలో పరుగులో ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ నాగరాజు ఫుట్‌బాల్ ఆడటానికి ప్రోత్సహించాడు. అయితే అందుకు తగిన కోచింగ్ కోసం హైదరాబాద్‌కు రావల్సి వచ్చింది. దీంతో కోచ్ నాగరాజు స్వయంగా తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఆమె పరుగులోని వేగం ఫుట్‌బాల్‌లో ఉపయోగపడుతుందని చెప్పాడు. దీంతో వాళ్లు సౌమ్య ఫుట్‌బాల్ ఆడటానికి ఒప్పుకున్నారు. ముందుగా నాగరాజు శిక్షణలోనే ఫుట్‌బాల్ బేసిక్స్ నేర్చుకున్న సౌమ్య.. ఆ తర్వాత హైదరాబాద్‌లో జాతీయ స్థాయి కోచ్‌ల వద్ద శిక్షణ పొందింది. సౌమ్యలో ఉన్న సహజసిద్దమైన మెరుపువేగం, బాల్‌ను డ్రిబ్లింగ్ చేసే ప్రతిభతో అతి తక్కువ సమయంలోనే మేటి క్రీడాకారిణిలో ఒకరిగా నిలిచింది. తాను ప్రాతినిథ్యం వహించే జట్లలో కీలకమైన స్ట్రైకర్‌గా ఎదిగింది. మిడ్ ఫీల్డర్‌గానూ రాణించగలగడం సౌమ్యకు ఉన్న మరో టాలెంట్.
అండర్ 14 నుంచి జాతీయ జట్టు వరకు
2015లో సౌమ్య టీమ్ ఇండియా అండర్-14 జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఆ తర్వాత చైనాలో జరిగిన అండర్-16 పోటీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్‌గా రికార్డు సృష్టించింది. మరోవైపు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్స్‌లో కూడా రాణించింది. గత ఏడాది జాతీయ స్థాయి ఉమెన్స్ లీగ్‌లో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. అంతే కాకుండా బ్రిక్స్ దేశాల మధ్య జరిగిన జూనియర్ మహిళల పోటీల్లోనూ రాణించింది. ఇలా స్ట్రైకర్, కెప్టెన్‌గా సౌమ్య తనను తాను నిరూపించుకోవడంతో 2022లో ఖతర్‌లో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి పంపే జాతీయ జట్టులో ఎంపిక చేశారు. ప్రస్తుతం టర్కీకి వెళ్లిన సౌమ్య.. అక్కడ జరుగనున్న టోర్నమెంట్‌లో జాతీయ జట్టుకు ఆడనున్నది. ఫిబ్రవరి 14 నుంచి టర్కీలో ఈ టోర్నీ జరుగనున్నది. ఆమె తొలిసారిగా జాతీయ జట్టుకు ఆడనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తొలి మహిళా ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించనున్నది.