నేటితో ఎన్నికల ప్రచారం క్లోజ్.. సాయంత్రం ఐదు గంటల తర్వాత గప్ చుప్!

by GSrikanth |   ( Updated:2023-11-28 02:16:31.0  )
నేటితో ఎన్నికల ప్రచారం క్లోజ్.. సాయంత్రం ఐదు గంటల తర్వాత గప్ చుప్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు రెండు నెలల పాటు జరిగిన ప్రచార హోరు కంప్లీట్ కానున్నది.. ఎలక్షన్ క్యాంపెయిన్ నేటి సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్నది. ఈసారి మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు అనివార్యం కావడంతో ఢిల్లీ నుంచి సీనియర్, అగ్రనేతల పర్యటనలతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో హడావిడి నెలకొన్నది. బహిరంగసభలు, రోడ్ షోలు, ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులు, వివిధ సెక్షన్ల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు.. ఇలాంటి అనేక ప్రోగ్రామ్‌లతో రాష్ట్రంలో నెలకొన్న కోలాహలం నేటితో సద్దుమణగనున్నది.

చివరి రోజు అగ్రనేతల ప్రచారం

చివరి రోజు ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ సహా ఆ పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్ర యూనిట్‌కు చెందిన స్టార్ క్యాంపెయినర్లు పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు పాల్గొంటున్నారు. బీజేపీ తరఫున మూడు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేసిన ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు తెలంగాణలో శక్తివంతంగా ఉన్న బీజేపీ.. రాష్ట్ర చీఫ్‌గా బండి సంజయ్‌ను తొలగించడంతో బలహీనపడింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. దాదాపు మూడు నెలల పాటు ప్రధాన యాక్టివిటీకి దూరంగా ఉండిపోయింది.

క్యాంపెయిన్ చివరి రోజున కాంగ్రెస్ అగ్రనేతలు రాహల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ వేర్వేరు ప్రోగ్రామ్‌లలో పాల్గొని సాయంత్రానికి ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. కేసీఆర్ ఇప్పటివరకు సుమారు 90 సభల్లో పాల్గొనగా చివరి రోజున వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలతోపాటు పోటీచేస్తున్న గజ్వేల్‌లో ఫైనల్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటున్నారు. దాదాపు రెండు నెలల పాటు జోరుగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగుస్తున్నది. ఒకదానిపై మరొక పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడంతో పాటు టీవీ ఛానెళ్ళు, పత్రికల్లో నెగెటివ్ ప్రకటనలు ఇవ్వడంలో పోటీ పడ్డాయి. గత ఎన్నికల్లో పాజిటివ్ కోణం నుంచి ప్రజల్లో ప్రచారం చేయగా ఈసారి కాంగ్రెస్ గెలిస్తే భవిష్యత్తు అంధకారమేనంటూ బీఆర్ఎస్.. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే జీవితాలు ప్రశ్నార్థకమేనంటూ కాంగ్రెస్ పరస్పరం ప్రచారం చేసుకున్నాయి.

ప్రలోభాల ప్రక్రియ స్టార్ట్

ప్రచారంలో రకరకాల రూపాలను ఎంచుకున్న పార్టీల అభ్యర్థులు, ఇన్‌చార్జిలు, లోకల్ లీడర్లు సైలెన్స్ పీరియడ్‌లో ఓటర్లను ప్రలోభపెట్టి ఆకర్షించే ఎత్తుగడలను మొదలుపెట్టనున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇప్పటికే మొదలయ్యాయి. ఒక్కో ఓటుకు రెండు వేల రూపాయల మొదలు గరిష్టంగా పది వేలు ఇవ్వడానికైనా ప్రధాన పార్టీలు సిద్ధపడుతున్నాయనే జనరల్ టాక్ గ్రామాల్లోని ఓటర్ల మధ్య వినిపిస్తున్నది. కొన్నిచోట్ల పంపిణీ కోసం వెళ్తున్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒక పార్టీ పోల్ మేనేజ్‌మెంట్ (ప్రలోభాలు) మీద మరో పార్టీ నిఘా వేస్తున్నది. పోటా పోటీగా ఓటుకు నోట్ల పంపిణీ ప్రక్రియపై దృష్టి పెట్టాయి. మూడో కంటికి తెలియకుండా ఈ ప్రక్రియను రహస్యంగా కానిచ్చేస్తున్నారు.

Read More: నేటి నుంచి ఆంక్షలు.. సాయంత్రం ఐదు గంటలకు వైన్స్ బంద్

Advertisement

Next Story