CM KCR ప్రభుత్వ మొద్దునిద్రే ఈ దారుణానికి కారణం: TDP

by GSrikanth |   ( Updated:2023-07-31 15:48:43.0  )
CM KCR ప్రభుత్వ మొద్దునిద్రే ఈ దారుణానికి కారణం: TDP
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం మూలంగానే వరదలతో రాష్ట్రం అతలాకుతలం అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు. వాతావరణశాఖ హెచ్చరికలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వం మొద్దనిద్రను వీడి బాధిత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్, భద్రాచలం పట్టణాలు నీటమునిగాయని దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, వందల గ్రామాల్లో జన జీవనం స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకుంటే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. ఒక గ్రామంలో రైతు కలెక్టర్‌కు ఫోన్ చేస్తే స్పందించని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పని చేయడం లేదని, స్థానిక సంస్థలను అలర్ట్ చేయలేదని ప్రభుత్వంలో చిత్త శుద్ధి లోపించిందని ఎద్దేవా చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణ సహాయాన్ని బాధితులకు అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, ఇండ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఏ ప్రభుత్వమైన విపత్కర పరిస్థితులు ఎదురైతే స్పందించి చర్యలు తీసుకోవాలి, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. మోరవంచపల్లి గ్రామస్తులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్న ప్రభుత్వం నేటివరకు బాధితులకు ఇవ్వలేదని ఆరోపించారు. హెలికాఫ్టర్లను పంపి ఉండి ఉంటే కొన్ని ప్రాణాలు బతికేవన్నారు. సీఎం ఏరియల్ సర్వే చేసి బాధితుల్లో ధైర్యం నింపాలని డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ రాష్ట్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నదని, బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితులను రైతాంగం, రైతులు, కూలీలు, చేతి వృత్తిదారులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితుల నుంచి వృత్తుల వారిని బయట పడవేయాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రజల కుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్, షేక్ ఆరిఫ్, మీడియా కోఆర్డినేటర్ బియ్యని సురేష్, కసిరెడ్డి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story