ప్రజా యుద్ధనౌక గద్దర్ కొత్త పార్టీ.. ఢిల్లీలో రేపు రిజిస్ట్రేషన్!

by GSrikanth |   ( Updated:2023-06-20 17:28:33.0  )
ప్రజా యుద్ధనౌక గద్దర్ కొత్త పార్టీ.. ఢిల్లీలో రేపు రిజిస్ట్రేషన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా గాయకుడు గద్దర్ ఎట్టకేలకు సొంత రాజకీయ పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఉదయం దరఖాస్తు చేయనున్నారు. అప్లికేషన్‌తో పాటు సమర్పించాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకుని ఆయన లీగల్ సలహాలందించే న్యాయవాదితో కలిసి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, ప్రధాన కార్యదర్శిగా జి.నగేశ్ కలిసి అప్లికేషన్‌ను ఎన్నికల అధికారులకు సమర్పించనున్నారు. రాజకీయ పార్టీగా దరఖాస్తు చేసుకోడానికి ముందు జరగాల్సిన ప్రక్రియ, లాంఛన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. పార్టీ పేరును సూచిస్తూ సమర్పించే దరఖాస్తుతో పాటే నియమ-నిబంధనావళిని సైతం జతచేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్నది గద్దర్ లక్ష్యం.

గత కొంతకాలంగా కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నేతలను ఢిల్లీలో కలుసుకున్న ఆయన ఏదో ఒక పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారన్నా ఊహాగానాలు ఇంతకాలం వినిపించాయి. కానీ గత నెల నుంచి సొంతంగా పార్టీ పెట్టడం కోసం ఆలోచనలు చేశారు. గత నెలలోనే దరఖాస్తు చేయాలని భావించినా కొన్ని కీలక వివరాలను సేకరించడంలో ఆలస్యం జరిగింది. అప్లికేషన్ దాఖలు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని డాక్యుమెంట్లను స్క్రూటినీ చేయడానికి వారం రోజుల వ్యవధి తీసుకుని ఆ తర్వాత పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సిందిగా సూచిస్తుంది. పార్టీ పేరుకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకోడానికి కమిషన్ నెల రోజుల గడువు ఇస్తుంది. ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులు, అభిప్రాయాలను స్టడీ చేయడానికి వారం రోజుల సమయం తీసుకున్న తర్వాత పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించనున్నది.

గద్దర్ ప్రజా పార్టీ పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేయాలని నిర్ణయం తీసుకున్న వార్తను ‘దిశ’ మే 15వ తేదీనే వెలుగులోకి తెచ్చింది.

Also Read.

Bandi Sanjay: ధనుష్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత..

Advertisement

Next Story

Most Viewed