అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు సార్.. థాక్రేకు జగ్గారెడ్డి కంప్లైంట్

by GSrikanth |   ( Updated:2023-08-20 09:25:01.0  )
అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు సార్.. థాక్రేకు జగ్గారెడ్డి కంప్లైంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీలోని కొందరు వ్యక్తులు తనను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మణిక్ రావు థాక్రేకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్ రావు థాక్రే, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరిని జగ్గారెడ్డి ప్రత్యేకంగా కలిశారు. గత ఏడాదిన్నర నుంచి పార్టీలో తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా.. కోవర్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కోసం తాను నిరంతరం శ్రమిస్తున్నానని, అయినప్పటికీ కొందరు వ్యక్తులు తనకు బీఆర్ఎస్‌తో సంబంధాలు ఉన్నట్లు కావాలనే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయిస్తున్నట్లు జగ్గారెడ్డి అన్నారు.

తాను పార్టీ మారడం లేదని, పార్టీకి చెందిన కొందరు వ్యక్తులే ఇట్లాంటి ప్రచారం వెనుక ఉండడం బాధాకరమని స్పష్టం చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వస్తుందని, సమిష్టి కృషితో జెండా ఎగురువేయాలని థాక్రే జగ్గారెడ్డితో సూచించారు. నేతల సమన్వయం కోసం తాను ప్రత్యేకంగా మాట్లాడుతానని హామీ ఇచ్చారు. హై కమాండ్ దృష్టి కూడా తీసుకు వెళ్తానని స్పష్టం చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story