విపక్షాల దృష్టి మళ్లించిన కేటీఆర్.. అందులోంచి తేరుకోకుండా చేసే ఎత్తుగడ!

by GSrikanth |   ( Updated:2023-09-14 03:02:35.0  )
విపక్షాల దృష్టి మళ్లించిన కేటీఆర్.. అందులోంచి తేరుకోకుండా చేసే ఎత్తుగడ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జమిలి ఎన్నికలపై మంత్రి కేటీఆర్ మంగళవారం చేసిన కామెంట్స్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ లీకుల వెనుక మతలబు ఏంటనే చర్చ మొదలైంది. సొంత పార్టీలో ఒక తరహా, విపక్షాల్లో మరో తరహా డిస్కషన్స్ మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు మెసేజ్ ఇవ్వడానికే ఈ కామెంట్లు చేశారా?.. లేక ప్రత్యర్థులను గందరగోళంలోకి నెట్టడానికా?.. పార్లమెంటు ప్రత్యేక సెషన్‌పై ఇప్పటికే ఉన్న సందేహాలకు అదనంగా కేటీఆర్ సరైన టైమ్ చూసుకుని కామెంట్స్ చేశారా?.. అలర్టు కోసమా? లేక డైవర్షన్ కోసమా?.. అనే సందేహాలు మొదలయ్యాయి. ‘మీడియాతో చిట్‌చాట్’ ప్రోగ్రామ్ పెట్టి జమిలి ఎన్నికలపై లీకులు ఇవ్వడం వెనక పక్కా స్ట్రాటెజీ ఉందన్న అనుమానాలు తలెత్తాయి.

కేటీఆర్ చేసిన కామెంట్స్ సొంత పార్టీ నేతలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చాయన్నది ఎలా ఉన్నా.. విపక్షాలను మాత్రం కన్‌ఫ్యూజన్‌కు గురిచేశాయి. గందరగోళాన్ని సృష్టించాలన్న ఉద్దేశంతోనే పనిగట్టుకుని మంత్రి జమిలిపై లీకులిచ్చారని భావిస్తున్నాయి. ఆ పార్టీలు ఇంకా దరఖాస్తుల ప్రక్రియలోనే ఉన్నాయి. అవి ఆ ప్రక్రియలోనే కొనసాగుతూ అందులోంచి తేరుకోకుండా చేసేందుకు పకడ్బందీ ప్లాన్‌లో భాగంగానే మంత్రి ఈ కామెంట్స్ చేశారన్నది విపక్షాల ఆరోపణ, అనుమానం. దీనిని పసిగట్టిన బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి.. షెడ్యూలు ప్రకారమే డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆలస్యమయ్యే చాన్సే లేదని స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికలూ ముందుకొచ్చే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ మాత్రం వర్కింగ్ కమిటీ సమావేశాలు, సోనియాగాంధీ సభ కార్యక్రమాల్లో బిజీగా ఉండిపోయింది.

టైమ్ చూసుకుని లీకులు

ప్రధాని మోడీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఎందుకు పెట్టారన్నది జాతీయ స్థాయి పార్టీల నేతలకే అంతు చిక్కలేదు. ఇప్పటికీ ఎజెండా ఖరారు కాలేదు. మరోవైపు మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటైంది. జమిలి ఎన్నికల నిర్వహణపై ఆ కమిటీ కసరత్తు చేస్తున్నది. స్పెషల్ సెషన్‌లో బిల్లు రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగేనాటికి జమిలి సాధ్యమేనా?.. ఇంత తక్కువ వ్యవధిలో చట్టంగా మారుతుందా?.. మినీ జమిలి పేరుతో లోక్‌సభకు, 11 రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఎన్నికలు వస్తాయా?.. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ వాయిదా పడతాయా?.. ఇలాంటి సందేహాలు కొనసాగుతున్న సమయంలో కేటీఆర్ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది.

సవరణ పేరుతో వివరణ

‘అక్టోబరు 10 వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తేనే షెడ్యూలు ప్రకారం ఎన్నికలు డిసెంబరులో జరుగుతాయి.. అలా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందనేది అనుమానమే.. ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశమున్నది..’ అంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ వార్తలు సొంత పార్టీ అభ్యర్థులనూ కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టాయి. దీంతో విపక్షాలూ అలర్టయ్యాయి. అనంతరం నిమిషాల వ్యవధిలోనే ‘నేను అలా అనలేదు..’ అంటూ సవరించే పేరుతో ఒక వివరణను మీడియాకు కేటీఆర్ అందజేశారు. పార్లమెంటు ప్రత్యేక సెషన్ తర్వాతనే జమిలి ఎన్నికలపై క్లారిటీ వస్తుందంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి తొలుత ఇచ్చిన లీకుల ద్వారా తాను పాస్ చేయాలనుకున్న మెసేజ్‌ను పంపించేశారు.

కాంగ్రెస్ అటెన్షన్ డైవర్షన్ కోసం

వ్యూహాత్మకంగానే ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. విపక్షాలను ఆ టెన్షన్‌లో పెట్టింది. అనివార్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం అభ్యర్థులను ఖరారు చేసే పని మొదలుపెట్టక తప్పలేదు. ఆ రెండు పార్టీలు ఆ హడావుడిలో ఉండగానే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయింది. పార్లమెంటు సెషన్‌లో జమిలి బిల్లు వస్తుందనే ఊహాగానాలతో ఎన్నికలు ఇప్పట్లో రావని వ్యాఖ్యానించి విపక్షాలను కేటీఆర్ డైలమాలోకి నెట్టారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయో బీజేపీకి సూచనప్రాయంగా తెలిసినా.. కేటీఆర్ వ్యూహాన్ని పసిగట్టలేక డిసెంబరులోనే వస్తాయంటూ రియాక్ట్ అయింది. కానీ కాంగ్రెస్‌ను కన్‌ప్యూజన్‌లోకి నెట్టాలన్నది కేటీఆర్ ఉద్దేశమని గ్రహించలేక తొందరపడి స్టేట్‌మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో టెస్ట్ చేయడం కోసం ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలంటూ మంత్రి కామెంట్‌ చేశారన్న వాదన తెరపైకి వచ్చింది. ఎలాగూ బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ-టీమ్’ అని కాంగ్రెస్‌ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. ఢిల్లీ నుంచి వచ్చిన హింట్‌తోనే కేటీఆర్ ఆ కామెంట్ చేశారని జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు భావించారు. స్టేట్ లీడర్లను కూడా అలాంటి ఇంప్రెషన్‌లోకి నెట్టాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఈ లీక్ ఇచ్చి ఉంటారన్న చర్చలూ జరిగాయి. కానీ సోనియాగాంధీ సభ, వర్కింగ్ కమిటీ సమావేశాల్లో హడావుడిలో ఉన్నందున స్టేట్ కాంగ్రెస్ లీడర్లెవరూ కేటీఆర్ కామెంట్లను సీరియస్‌గా తీసుకోలేదు. ఎవ్వరూ రియాక్ట్ కాలేదు.

ఐటీ డిపార్టుమెంటు సన్నాహకాలు స్టార్ట్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఒక మేరకు క్లారిటీ ఉన్నది. పోలీసు, జీఎస్టీ, ఐటీ ఇలా మొత్తం 12 రకాల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్టుమెంట్ల అధికారులతో టచ్‌లో ఉన్నది. మద్యం, నగదు రవాణా నివారణకు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకున్నది. ఇతర డిపార్టుమెంట్ల కన్నా ముందే ఆదాయపు పన్ను శాఖ కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాకొక నోడల్ అధికారిని నియమించింది. అన్ని జిల్లాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసేలా 88 మందిని డిప్యూటేషన్‌పై పంపేందుకు చార్ట్ తయారుచేసింది. మరో ఆరుగురితో రిజర్వు టీమ్‌నూ హైదరాబాద్‌లో రెడీ చేస్తున్నది. సంబంధిత అధికారులకు ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్ సమాచారం ఇచ్చారు. షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్న ఇండికేషన్‌తోనే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సీఈఓ ఆఫీస్ సైతం అక్టోబరు 4న ఫైనల్ ఓటర్ లిస్టును రిలీజ్ చేస్తున్నది. ఇప్పటికే డూప్లికేట్, బోగస్ ఓటర్ల పేర్లను డిలీట్ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. సవరణలు, అడిషన్స్ కోసం వచ్చిన దరఖాస్తుల స్క్రూటినీ వేగంగా జరుగుతున్నది. తుది జాబితా విడుదల చేయడంతోనే షెడ్యూలు విడుదలకు లైన్ క్లియర్ అయినట్టు లెక్క. ఈ హడావుడి అంతా షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయన్నదానికి సంకేతం. కానీ ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముందంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్.. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడానికే అనే చర్చకు తావిచ్చినట్టయింది.

Advertisement

Next Story

Most Viewed