ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌ గూటికి సుధీర్ రెడ్డి..!

by Javid Pasha |   ( Updated:2023-10-11 06:48:59.0  )
ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌ గూటికి సుధీర్ రెడ్డి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి గోడ దూకేస్తున్నారు. దీంతో హస్తం పార్టీలోకి భారీగా వలసలు పెరిగిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌ గూటికి చేరగా.. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

2014 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ తరపున సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2018 ఎన్నికల్లో ఆయనను కాదని మల్లారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఆ తర్వాత మల్లారెడ్డి మంత్రి కావడం, బీఆర్ఎస్ అధిష్టానానికి బాగా దగ్గర కావడంతో సుధీర్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు. తనకు సీటు దక్కకపోవడానికి మల్లారెడ్డి కారణమనే భావనతో ఆయనపై సుధీర్ రెడ్డి బహిరంగంగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోన్నారు. దీంతో సుధీర్ రెడ్డిని చల్లార్చేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కేసీఆర్ కట్టబెట్టగా.. ఆయన కుమారుడికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చారు.

కానీ బీఆర్ఎస్‌లో ఉంటే పార్టీ కోసం పనిచేయాలి తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం రాదనే భావనలో సుధీర్ రెడ్డి ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సుధీర్ రెడ్డికి బంధుత్వం ఉంది. దీంతో కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా సుధీర్ రెడ్డిని గతంలో రేవంత్ ఆహ్వానించారు. రేవంత్ రెడ్డితో సుధీర్ రెడ్డి గతంలో భేటీ కావడంతో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది.

సుధీర్ రెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నా.. టికెట్‌పై హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే మేడ్చల్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం భారీ పోటీ నెలకొంది. హరివర్దన్ రెడ్డి, జంగయ్య యాదవ్ పోటీ పడుతున్నారు. సుధీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు వారిని బుజ్జగించేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు హస్తం శ్రేణులు చెబుతున్నారు. దీంతో త్వరలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే టాక్ మేడ్చల్ నియోజకవర్గంలో వినిపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed