TS: అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-09-12 10:12:31.0  )
TS: అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 10వ తేదీలోపు నోటిఫికేషన్ వస్తేనే రాష్ట్రంలో డిసెంబర్ లేదా? జనవరిలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. కానీ, అక్టోబర్‌లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్, మే నెలలోనే జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఈనెల 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిశాక నవంబరు మూడోవారం తర్వాత శీతాకాల సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగియగా 40 రోజుల్లోపే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మరోవైపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈనెల 15న ప్రగతి భవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed