ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌లో మరో కల్లోలం.. అధిష్టానంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి..

by Javid Pasha |   ( Updated:2023-09-06 10:13:49.0  )
ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌లో మరో కల్లోలం.. అధిష్టానంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సారి జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందేందుకు టీ కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా ఈ సారి ఎలాంటి లాబీయింగ్‌కు తావు లేకుండా గెలుపొందే అవకాశం ఉన్న బలమైన అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించేందుకు కసరత్తలు చేస్తోంది. అలాగే బీఆర్ఎస్‌లో సీటు దక్కని నేతలను చేర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది.

కానీ ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల తీరు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. నేతల అలకలు, విబేధాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిటీలో కోమటిరెడ్డికి చోటు దక్కలేదు. అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలోనూ అవకాశం కల్పించకపోవడంతో వెంకటరెడ్డి అలకబూనారు. దీంతో గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా పాల్గొనడం లేదు. కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల కొద్దిరోజులపాటు వెంకటరెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. పార్టీలోకి కొత్త నేతల చేరికలు, కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంకు సంబంధించి ఆయన చర్చలు జరిపారు. కానీ ఎన్నికల వేళ వెంకటరెడ్డి సైలెంట్‌ కావడంతో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. కేసీ వేణుగోపాల్ రెడ్డి ఇప్పటికే ఫోన్‌లో వెంకటరెడ్డితో మాట్లాడారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌లు కూడా కోమటిరెడ్డితో మాట్లాడుతున్నారు. పార్టీలో మళ్లీ యాక్టివ్ కావాలని సూచిస్తున్నారు.

ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తెలంగాణ నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే చోటు కల్పించారు. దీంతో సీనియర్ నేత, ఎంపీగా ఉన్న తనను పట్టించుకోకపోవడంపై కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌లో నేతలందరూ కలిసి ఒకేతాటిపైకి వచ్చి పనిచేయలేని పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. ఎవరువారు విడివిడిగా పనిచేస్తున్నారు తప్ప.. నేతలందరూ కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేయడం లేదు. కాంగ్రెస్‌కు ఇది కాస్త మైనస్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed