బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌కు కిషన్ రెడ్డి సంధించిన ఎనిమిది ప్రశ్నలు ఇవే!

by GSrikanth |   ( Updated:2023-08-27 16:07:15.0  )
బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌కు కిషన్ రెడ్డి సంధించిన ఎనిమిది ప్రశ్నలు ఇవే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ మరోసారి ఆత్మత్యాగానికి సిద్ధమైందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. మరోసారి కాంగ్రెస్ తమకు తాము బీఆర్ఎస్‌కు తాకట్టు పెట్టుకుంటున్నారని, బీఆర్ఎస్‌తో డీల్ చేసుకుని ముందుకెళ్తుండటమే ఇందుకు నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలకు మజ్లిస్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే బీఆర్ఎస్‌కు ఓటేసినట్లేనని ఆయన చెప్పారు. ఈ విషయంలో నష్ట నివారణ కోసం, ఉపశమన చర్యల్లో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెవేళ్ల సభలో పూర్తి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు.

బీజేపీయేతర పక్షాల వేదికలపై కేసీఆర్ కనబడలేదన్నారని, కానీ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఓ బహిరంగ రహస్యంగా చెప్పారు. మొన్నటికి మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒకరికొకరు మద్దతు తెలుపుకున్న విషయాన్ని ఖర్గే మరిచిపోయారా? లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారా? అని కిషన్ రెడ్డి చురకలంటించారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, సోనియా గాంధీ కుటుంబం ఎంతకైనా తెగిస్తుందని, అవసరమైతే తమ ఓటును పూర్తిగా అవినీతి, అక్రమ, కుటుంబ రాజకీయాలు చేసే బీఆర్ఎస్‌కు బదిలీ చేయడం ద్వారానైనా తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవాలనేది వారి ఆలోచనగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నీతివంతమైన పార్టీ అయితే బీఆర్ఎస్‌కు మధ్య దోస్తీ లేదనే విషయాన్ని నిరూపించాలనుకుంటే.. తన 8 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, బీజేపీకి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎనిమిది ప్రశ్నలివే..

1. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి భూమి లేదని బుకాయిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ కు హైదరాబాద్ నడిబొడ్డున ఎకరం భూమి కేవలం రూ.2 లక్షల చొప్పున 10 ఎకరాలను కట్టబెట్టింది వాస్తవం కాదా?

2. కేటీఆర్ ఇటీవల తన ప్రసంగంలో బీజేపీని ఓడించడానికి బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి పోరాడుతామని, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తామని చెప్పింది నిజం కాదా?

3. తెలంగాణలో చేతి గుర్తుమీద గెలిచిన చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మీ ఎమ్మెల్యేల మీద మీరు చర్యలు తీసుకోకపోవడం మీ రెండు పార్టీల మధ్య ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం కాదా?

4. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకునే చారిత్రాత్మక అవకాశాన్ని కాదని, బీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపింది? రెండు పార్టీలు ఒక వేదికమీద ఉన్నారనేది నిజం కాదా?

5. శాసనమండలిలో కాంగ్రెస్ ను పూర్తిగా బీఆర్ఎస్ లో విలీనం చేసేసినపుడు స్పందించకపోవడం రెండు పార్టీల మధ్య దోస్తీకి పరాకాష్ట కాదా?

6. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మతతత్వ మజ్లిస్ సయోధ్య కుదుర్చుతోంది. అందుకే అందరూ ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? బీఆర్ఎస్ మద్దతులేకుండా యూసీసీని వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ చెప్పగలదా?

7. మొన్నటికి మొన్న లోక్‌సభ సమావేశాలలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి అనుకూలంగా ఓటు వేసిన విషయం వాస్తవం కాదా? ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిసి కూడా, ఢిల్లీ ప్రభుత్వ సర్వీసుల బిల్లుపై ఆప్, కాంగ్రెస్ కు మద్దతుగా బీఆర్ఎస్ ఓటు వేయడం నిజం కాదా?

8. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులుగా అధికారాన్ని అనుభవించలేదా? అప్పటినుంచే స్నేహం కొనసాగుతున్నది నిజం కాదా? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.

Advertisement

Next Story