- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంలో చక్రం తిప్పేలా కేసీఆర్ ప్లాన్! ఈసారి గెలిస్తే కేటీఆరే సీఎం?
దిశ, తెలంగాణ బ్యూరో : అన్నీ అనుకున్నట్టుగా జరిగి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? కేసీఆరా?.. కేటీఆరా?.. ఈ చర్చ గత కొంతకాలంగా జరుగుతున్నది. ముచ్చటగా మూడోసారీ సీఎం అయ్యేది కేసీఆరేనని స్వయంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా ఐదారు నెలలు మాత్రమే కంటిన్యూ అవుతారనే టాక్ ఆ పార్టీ నేతల్లో వినిపిస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందో లేక తర్వాతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్ర బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కేసీఆర్ ఇమేజ్‌తోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. గెలిచిన తర్వాత సీఎం ఎవరవుతారన్నది ఆ పార్టీకి మాత్రమే సంబంధించిన వ్యవహారం. ఎన్నికలకు ముందే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీఆర్ఎస్ భావించడం లేదు. అలాంటి ప్రకటన చేస్తే అది దుస్సాహసమే అవుతుందని ఆ పార్టీకి తెలుసు. అందుకే బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం..
సౌత్ ఇండియాలోనే థర్డ్ టైమ్ సీఎం అయిన రికార్డు కేసీఆర్‌కే సొంతం అని కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే జరిగే లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అందులో చేరే అవకాశాలున్నట్టు ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తూ పక్కా వ్యూహంతో గులాబీ బాస్ అడుగులేస్తున్నారు.
కేటీఆర్‌కు పెరిగిన ప్రాధాన్యం
రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేసి కేటీఆర్‌కు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. పార్టీకి అధ్యక్షుడు కేసీఆరే అయినా బీఆర్ఎస్‌గా పేరు మార్చిన తర్వాత రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన మొత్తం వ్యవహారాలను కేటీఆరే చక్కదిద్దుతున్నారు. మరోవైపు పాలనా వ్యవహారాల్లోనూ చురుగ్గా ఉన్నారు. డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారనే ముద్ర ఆయనపై ఉండనే ఉన్నది. అనేక శాఖలకు సంబంధించిన సమీక్షా సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు.
ఇటీవల జిల్లాల పర్యటన సందర్భంగా అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులను కూడా కేటీఆరే ప్రకటిస్తున్నారు. సీఎం తరహాలోనే ఢిల్లీకి స్పెషల్ ఫ్లయిట్‌లలో వెళ్తున్నారు. రాష్ట్ర పర్యటనల్లో హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. కేసీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేలకు తగిన అవకాశాలు లేకపోవడంతో వారు కేటీఆర్‌ను కలిసి పనులు చక్కదిద్దుకుంటున్నారు. ఆయనకు దగ్గరైతే పార్టీలో పదవులు, స్థానం, టికెట్ ఖాయమనే భావన లీడర్లలో నెలకొన్నది.
కేసీఆర్ తర్వాత ఎవరు అని పార్టీ నేతలను ప్రశ్నిస్తే వెంటనే కేటీఆర్ అనే సమాధానమే వినిపిస్తున్నది. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా హరీశ్‌రావుకు గుర్తింపు ఉన్నా నిర్వహణ విషయంలో మాత్రం కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది స్థిరపడింది. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇద్దరు సొంత పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారంలో భాగంగా తాటికొండ రాజయ్యను ప్రగతి భవన్‌కు రావాల్సిందిగా ఆదేశించింది కూడా కేటీఆరే. దేశానికి కేసీఆర్.. రాష్ట్రానికి కేటీఆర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది.
సంకీర్ణంలో భాగస్వామిగా బీఆర్ఎస్?
ప్రాంతీయ పార్టీగా దాదాపు ఇరవై ఏండ్లకు పైగా కొనసాగిన టీఆర్ఎస్ గతేడాది దసరా నుంచి బీఆర్ఎస్‌గా మారింది. జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి నేషనల్ పార్టీగా గుర్తింపు పొందాలన్నది ఆ పార్టీ టాస్క్. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఎదగాలన్నది దీర్ఘకాలిక వ్యూహం. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగానే నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ ఫ్రంట్ పేరుతో పలు ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కానీ అది అనుకున్న తీరులో సక్సెస్ కాలేదు.
దీంతో బీఆర్ఎస్ పేరుతో ఒంటరిగానే వెళ్లేలా ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ అవుతున్నారు. మహారాష్ట్రలో వందలాది మందిని చేర్చుకుంటూ జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులను ఓపెన్ చేస్తున్నారు. పార్టీ బలపడే యాక్షన్ ప్లాన్‌తో బహిరంగసభలను నిర్వహిస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ స్లోగన్‌తో తనదైన శైలిలో ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. ఒక పొలిటికల్ ప్రెషర్ గ్రూపుగా ఎస్టాబ్లిష్ కావాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేననే భావనతో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా అందులో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
మోడీతో సయోధ్య?
అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌తో సమదూరం పాటిస్తున్నట్టు పైకి కనిపిస్తున్నా ప్రధాని మోడీతో కేసీఆర్ ఇప్పటికే రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు తెరపైకి రావడం, మూడుసార్లు ఈడీ విచారించడంతో దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉసిగొల్పుతున్నదంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నదంటూ బహిరంగంగా విమర్శించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కాంగ్రెస్‌పైకి బాణం ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వంతో తమకు సంబంధమే లేదంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చినా జూన్ చివరి వారంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఇవి బీజేపీకి దగ్గరయ్యే పొలిటికల్ మీటింగులనే ఊహాగానాలు వచ్చాయి. ఈ సమయంలోనే బీజేపీకి బీ-టీమ్ బీఆర్ఎస్ అని రాహుల్‌గాంధీ కామెంట్ చేశారు.
కాంగ్రెస్‌కూ బీఆర్ఎస్ అవసరం?
పదేండ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గద్దెనెక్కక్కేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే భారత్ జోడో యాత్ర చేపట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పవర్‌లోకి రావడంతో ఆశలు చిగురించాయి. తదుపరి జాబితాలో తెలంగాణ చేరింది. ఎలాగూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తిరిగి పవర్‌లోకి వస్తామన్న నమ్మకం ఆ పార్టీలో ఉన్నది. ఈ ప్రభావంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈసారి సీట్లు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నది.
తగిన సంఖ్యా బలం లేకుంటే యూపీఏ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల సహకారాన్ని కోరే ఆలోచనా లేకపోలేదు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అంటూ ఇప్పుడు ఆరోపిస్తున్నా, గులాబీ పార్టీతో పొత్తు ఉండదని రాహుల్ తెగేసి చెప్పినా భవిష్యత్తులో మద్దతు కోరే అవకాశాలూ ఉన్నాయి. సరిగ్గా అలాంటి ఆప్షన్‌తోనే అఖిలేశ్ ద్వారా కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. యూపీఏ అయినా, ఎన్డీఏ అయినా సంకీర్ణ సర్కార్‌లో బీఆర్ఎస్ చేరిక అనివార్యమయ్యేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
పాలిటిక్స్‌లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న ఫిలాసఫీకి తగినట్టుగా బీఆర్ఎస్ దూరదృష్టితో అడుగులేస్తున్నది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే చాణక్య వ్యూహంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో కేసీఆర్.. రాష్ట్రంలో కేటీఆర్ ఫార్ములా వర్కౌట్ కావాలన్నది ఆ పార్టీ వ్యూహం. నౌ ఆర్ నెవర్ తరహాలో ఇప్పుడు కాకపోతే ఇక కేటీఆర్ సీఎం అయ్యేదెప్పుడు అనే చర్చలకు ఈ ఏడాది చివర్లోనే ఫుల్‌స్టాప్ పడనున్నది. కేసీఆర్ ఫొటోతోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా కాబోయే సీఎం ఎవరనేది కాలం తేల్చనున్నది.