కాళీ ప్రసాద్ రావు చేరికను అడ్డుకున్నారా.. వాయిదా పడిందా?

by GSrikanth |   ( Updated:2023-08-15 15:01:18.0  )
కాళీ ప్రసాద్ రావు చేరికను అడ్డుకున్నారా.. వాయిదా పడిందా?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ప్రముఖ వైద్యుడు కాళీ ప్రసాద్‌రావు బీజేపీలో చేరిక వాయిదా ప‌డింది. ఈనెల 19న ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో నిర్వహించ‌త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ‌ను వాయిదా వేసినట్లు బీజేపీలోని విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. కాళీ ప్రసాద్‌రావు చేరిక‌ను వ్యతిరేకిస్తూ కొంత‌మంది ప‌రకాల‌కు చెందిన‌ బీజేపీ నేత‌లు రాష్ట్ర అధ్యక్షుడు జి.కిష‌న్ రెడ్డికి ఫిర్యాదు చేయ‌డమే తాజా ప‌రిస్థితికి కార‌ణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాళీ ప్రసాద్‌రావుపై ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లిన నేత‌ల‌పై రాష్ట్ర అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్ సీరియ‌స్‌గా ఉన్నట్లు స‌మాచారం. అయితే పార్టీ ఆధ్వర్యంలో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ‌కు స‌ద‌రు అస‌మ్మతి నేత‌ల నుంచి స‌హ‌కార‌లేమి ఉండే అవ‌కాశం ఉండ‌టంతోనే స‌భ‌ను, కాళీ ప్రసాద్‌రావు చేరిక‌ను తాత్కలికంగా వాయిదా వేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రక‌ట‌న చేసిన త‌ర్వాత ఇలా నేత‌లు ఫిర్యాదులకు వెళ్లడంపై కాళీ ప్రసాద్‌రావు అసంతృప్తి, మ‌న‌స్తాపం చెందిన‌ట్లుగా స‌మాచారం. బీజేపీలో చేరిక వాయిదా ప‌డినట్లుగా బీజేపీ నేత‌ల నుంచి వ‌స్తున్న స‌మాచారంపై కాళీ ప్రసాద్‌రావు వివ‌ర‌ణ కోరేందుకు ‘దిశ’ ప్రయ‌త్నించ‌గా నో కామెంట్ అంటూ బదులివ్వడం విశేషం.

కేడ‌ర్‌లో క‌న్ఫ్యూజ‌న్‌..!

వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షప‌తి గ‌త ఆరు నెల‌లుగా ప‌ర‌కాల‌లో బీజేపీ బ‌లోపేతానికి కృషి చేస్తూ వ‌స్తున్నారు. కాళీ ప్రసాద్‌రావును పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయ‌న‌, ఈట‌ల‌తో స‌మానంగా కృషి చేశారు. కాళీ ప్రసాద్‌రావును ఈనెల 19న పార్టీలో చేర్చుకోవాల‌ని, అందుకు ప‌రకాల‌లో బ‌హిరంగ స‌భ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే అనుహ్యంగా ప్రసాద్‌రావుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడం, పార్టీలో అస‌మ్మతిని రాజేసే ప్రయ‌త్నాలు జ‌రుగుతుండ‌టంతో స‌భ‌ను, చేరిక‌ను వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. క్లీన్‌చిట్ ఉన్న వ్యక్తిత్వం, వేలాది మంది ప్రజ‌ల‌తో నేరుగా స‌త్సబంధాలు, మంచి ప్రజాక‌ర్షణ శ‌క్తి, స‌మాజాన్ని ఆక‌లింపు చేసుకున్న విద్యార్హత‌, స‌మ‌కాలీన రాజ‌కీయాల‌కు కావాల్సినంత ఆర్థిక ప‌రిపుష్టిత్వం క‌లిగి ఉన్న నేత పార్టీలోకి వ‌స్తానంటే అడ్డుకునే ప్రయ‌త్నాలు చేయ‌డం ఏంట‌న్న ప్రశ్నలు స‌గ‌టు బీజేపీ కార్యక‌ర్తలు సంధిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed