KTR : మంత్రి కేటీఆర్‌కు కీలక టెస్ట్.. రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం?

by GSrikanth |   ( Updated:2023-09-29 08:05:23.0  )
KTR : మంత్రి కేటీఆర్‌కు కీలక టెస్ట్.. రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కేటీఆర్ రాజనీతిజ్ఞకు పరీక్ష కానున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ప్రస్తుతం పార్టీలో అన్నీతానై నడిపిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించడం ఓవైపు, ఆశావాహుల సహకారం మరోవైపు కోరుతున్నారు. అయితే రాబోయే అసెంబ్లీలో రెబల్ పోటీని నివారించడం సవాలే కానుంది. ఇప్పటికే కాబోయే సీఎం కేటీఆర్ అని నేతలు పేర్కొంటుండటంతో ఆయనకు ఎన్నికలు కీలక టెస్టుగా మారాయి. ఎలాంటి ఫలితాలు సాధిస్తారోనని పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికలు కేటీఆర్‌కు టాస్క్‌గా మారాయి. ఆయన రాజకీయ భవిష్యత్‌కు నాంది కానున్నాయని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అన్నీతానై వ్యవహరిస్తున్న కేసీఆర్.. గత కొద్దికాలంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారు. తాను అందుబాటులో లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కార్యక్రమాలు నిర్వర్తిస్తారని గతంలో కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పార్టీ కార్యక్రమాల మొదలు కొన్ని అన్ని కార్యక్రమాలను అన్నీతానై కేటీఆర్ నిర్వహిస్తున్నారు. గత నెల 21న రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను మాత్రం కేటీఆర్కు అప్పగించారు. మొదటిసారి కేసీఆర్ బాధ్యతలు ఇచ్చారు. అయితే ఒకవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేశారు. మరోవైపు ఆశావాహులను సైతం ప్రగతిభవన్ కు పిలుపించుకొని పదవుల హామీ ఇస్తున్నారు. ఎన్నికలకు సహకరించాలని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని అందరికి గుర్తింపు లభిస్తుందని వారికి వివరిస్తున్నారు. అయితే కొంతమంది సరేనని అంటూనే తిరుగుబావుట ఎగురవేస్తుండటం తలనొప్పిగా మారింది.

రెబల్ పోటీని నివారించడం సవాలే...

బీఆర్ఎస్ పార్టీ నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు టికెట్ ఆశించారు. అయితే తిరిగి సిట్టింగ్ లకే ఇవ్వడంతో సుమారు 40 నియోజకవర్గాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. వారందరినీ శాంతింపజేసే బాధ్యతను కేటీఆర్ కు పార్టీ అధినేత అప్పగించారు. అయితే స్టేషన్ ఘన్ పూర్, జనగాం, నర్సాపూర్, ఉప్పల్, ఖానాపూర్, వైరా, పటాన్ చెరువు, కల్వకుర్తి ఇలా పలు నియోజకవర్గాల్లో మాత్రం అసంతృప్తి గాడినపడలేదు. ఇంకా టికెట్ ఆశిస్తూనే ఉన్నారు. పార్టీ అధిష్టానం మరోసారి చర్చలు జరిపి హామీలు ఇస్తే పార్టీలో ఉన్నా... రాబోయే ఎన్నికల్లో రెబల్ గా పోటీచేస్తే పరిస్థితి ఏంటదన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వారు పోటీ చేయకపోయినా ఆశావాహులు పోటీచేస్తే బీఆర్ఎస్ పై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. ఒకవేళా పార్టీలో ఉన్నప్పటికీ అభ్యర్థికి సహకరించకపోతే పరిస్థితి ఏంటదన్నది పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పార్టీని గెలిపించుకోకపోతే... రెబల్ పోటీని నివారించకపోతే కేటీఆర్ రాజకీయ భవిష్యత్ పై పడే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. యువనేతకు ఈ ఎన్నికలు పరీక్షేనని పలువురు పేర్కొంటున్నారు.

ఓట్లు డైవర్ట్ కాకుండా చూసుకునే బాధ్యత

ప్రతి ఓటు బీఆర్ఎస్ కు కీలకం కానుంది. అయితే అసంతృప్తి నేతలను శాంతింపజేసి కేడర్ లో జోష్ నింపి ఓటు డైవర్డ్ కాకుండా చూసే బాధ్యత కేటీఆర్ పై ఉంది. పార్టీని గట్టేక్కించే బాధ్యత ఆయనదే. అయితే ఇప్పటికే సిట్టింగ్ లపై కేడర్ లో వ్యతిరేకత ఉండటం వారికే మరోసారి అవకాశం కల్పించడంతో నారాజ్ గా ఉన్నారు. అయితే వారితో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వనున్నాయో చూడాలి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుండటంతో గులాబీ నేతలకు కొంత ఆందోళన కలిగిస్తుంది.

కాబోయే సీఎంగా ఆయనకు కీలక టెస్ట్

కేటీఆర్‌కు ఎన్నికలు కీలక టెస్టు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలతోపాటు రాజకీయ చతురతను పార్టీ అధినేత గమనిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీలో అసంతృప్తి నేతలను బుజ్జగించే విధానాలను పరిశీలిస్తున్నారు. కొన్ని రాజకీయ మెళకువలను కేసీఆర్ చెబుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆశావాహుల, అసంతృప్తి నేతలను శాంతింపజేసే బాధ్యలను కేటీఆర్ నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా పార్టీనేతలే కాబోయే సీఎం కేటీఆర్ అని.. జాతీయ నేత కేసీఆర్ పలు వేదికలపైన పేర్కొంటున్నారు. కేసీఆర్ మాట్లాడొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ నేతలు మాత్రం కేటీఆరే భవిష్యత్ సీఎం అని బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే ప్రస్తుతం పార్టీలో అన్నీతానై వ్యవహరిస్తున్న కేటీఆర్ .. పార్టీని గెలిపించుకొని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయనదే. అయితే పార్టీలోని అసంతృప్తి, మరోవైపు రెబల్ గా నేతలు పోటీచేయకుండా ఏమేరకు విజయవంతం అవుతారో అనేది చూడాలి. ఏదీ ఏమైనప్పటికీ కేటీఆర్‌కు మాత్రం అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ భవిష్యత్ కు కీలకం కానున్నాయని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed