- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ లీడర్లపై ఐటీ దాడులతో బీఆర్ఎస్‌కే నష్టం.. ఎట్టకేలకు గుర్తించారా?
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ లీడర్లే టార్గెట్‌గా జరుగుతోన్న ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు, దాడులతో బీఆర్ఎస్ లీడర్లలో గుబులు మొదలైంది. ఆ దాడులతో గులాబీ పార్టీకి ఎలాంటి సంబంధం లేనప్పటికీ బీజేపీకి చెప్పి చేయిస్తున్నదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పదేళ్ళ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి ఉన్న సమయంలో, కాంగ్రెస్ పట్ల అనుకూల పవనాలు వీస్తున్న సమయంలో ఈ దాడులు జరగడం చివరకు బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటుందనే భయం వెంటాడుతున్నది. ఇప్పటికే బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ దాడుల వెనక బీఆర్ఎస్ పరోక్ష ప్రమేయం ఉన్నదనే వాతావరణం నెలకొన్నట్లయింది. కాంగ్రెస్ పదేపదే ఈ కామెంట్ చేస్తుండడంతో జనంలోకి వెళ్ళిపోయింది.
ఈ దాడులు కాంగ్రెస్ దూకుడును కట్టడి చేయడానికి బదులుగా ప్రజల్లో ఆ పార్టీ పట్ల మరింత సానుభూతి పెరగడానికే దోహదపడుతుందన్నది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ఈ దాడులు మరింతగా పెరిగితే సానుభూతి కూడా అదే స్థాయిలో పెరిగే ప్రమాదం ఉన్నదని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం కలిగిస్తాయన్నది ఆ పార్టీ నేతల ఆందోళన. పార్టీలకు అతీతంగా జరుగుతున్న దాడులని ఎంతగా చెప్పినా దాని వెనక బీజేపీ ఉన్నదనేది ఒక సాధారణ అభిప్రాయం. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడానికి, పోల్ మేనేజ్‌మెంట్ జరగనీయకుండా చిక్కుల్లోకి నెట్టడానికి బీజేపీని వాడుకుని బీఆర్ఎస్ ఈ స్కెచ్ వేసిందన్న మాటలు సాధారణ ప్రజానీకం మధ్యలోనూ జరుగుతుండడం గులాబీ నేతల దృష్టిలో పడింది.
ప్రజల్లో సానుభూతి
కాంగ్రెస్ లీడర్లపై ఈమధ్య వరుసగా జరుగుతోన్న ఐటీ దాడులు ఆ పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చే పరిణామాలుగా మారుతున్నాయని గులాబీ లీడర్ల అంచనా. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయని లోలోపల నిర్ధారణకు వచ్చారు. ప్రజల్లోనూ జోరుగా సాగుతున్న ఈ పరిణామాలు ఒక వేవ్‌ను క్రియేట్ చేస్తుందేమోననే ఆందోళన కూడా ఉన్నది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ లీడర్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు ఆ పార్టీకి నష్టం కలిగించే సంగతి ఎలా ఉన్నా ప్రత్యర్థిగా ఉన్నందున బీఆర్ఎస్ చేయిస్తున్నదనే అపవాదుకే ఎక్కువ ఆస్కారం ఉన్నదనేది గులాబీ నేతల విశ్లేషణ. అందుకే బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన పడుతున్నారు. సరిగ్గా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, కామెంట్లు కూడా ప్రజల్లో ఆ పార్టీ పట్ల మరింత సానుభూతి పెరగడానికే దోహదపడుతున్నదని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ అవగాహన ఉందని కాంగ్రెస్ బలంగా ఆరోపిస్తున్నది. మరోవైపు బీ-టీమ్ ఆరోపణలపై ఇచ్చిన కౌంటర్ సైతం ఆ ఆరోపణలు రిపీట్ కాకుండా నివారించలేకపోయాయి. సరిగ్గా ఈ టైమ్‌లో ఐటీ సోదాలు జరగడం ఆ ఆరోపణలను నిజంచేసే విధంగా ఉన్నాయని గులాబీ లీడర్లు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. తనిఖీల్లో ఐటీ బృందాలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఆరోపించారు. దీంతో ఇదంతా రాజకీయంగా కాంగ్రెస్‌ను కట్టడి చేయడం కోసమేననే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లి మరింత ప్రమాదంలో పడతామనే అంచనాకు వచ్చారు.
నామినేషన్ల ప్రక్రియ ముగిసి ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న ఈ సమయంలో దాడులను కంట్రోల్ చేయలేకపోతే అది కాంగ్రెస్‌కే కలిసొస్తుందని, ఇప్పుడున్న బలంకంటే మరింతగా తగ్గి ప్రమాదంలో పడతామనేది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఐటీ సోదాలు ఇక్కడితో ఆగిపోతాయా?.. లేక ఇక ముందు కూడా కొనసాగుతాయా?.. అనేది కీలకంగా మారింది. హఠాత్తుగా ఆపివేస్తే బీఆర్ఎస్ చొరవ తీసుకుని ఫుల్ స్టాప్ పెట్టించిందనే అపవాదు తలెత్తుంది. ఒకవేళ కంటిన్యూ అయితే కాంగ్రెస్‌కే అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఈ చిక్కులను ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.