- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోటీ చేసేందుకు జంకుతున్న BJP సీనియర్లు.. ఆ ఫార్ములా పనిచేయదని అనుమానం!
దిశ, తెలంగాణ బ్యూరో: టీ-బీజేపీలో సీనియర్ల పరిస్థితి మింగలేక, కక్కలేక అన్న తీరుగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సాఫ్ట్ కార్నర్ అంశంతో సంబంధం లేకుండానే పార్టీలో జరుగుతున్న నిర్ణయాలతో వారు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. బెంగాల్ పార్ములా దిశగా హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి సీనియర్ నేతలంతా అసెంబ్లీ బరిలో ఉండాల్సిందేనని జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం వారికి సవాలుగా మారింది. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించలేక సొంత అభిప్రాయాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే భయంతోనే ఈసారి బరిలో ఉండడానికి ఆసక్తి చూపడంలేదు. స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, లక్ష్మణ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులంతా లోక్‌సభకు పోటీ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన చేదు అనుభవాలే ఈసారి కూడా రిపీట్ అవుతాయని వారిలో కొంతమంది స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. అందువల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొగ్గు చూపడంలేదు. ఒకవేళ పోటీ చేసినా రాష్ట్రంలోని తాజా పరిస్థితుల కారణంగా గెలవడం కష్టమేనని భావిస్తున్నారు. గౌరవప్రదంగా లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ఇమేజ్‌తో నిలబడి గెలవాలని అనుకుంటున్నారు.
కిషన్‌రెడ్డికి పెరిగిన భయం!
అంబర్‌పేట్ నియోజకవర్గంలో తిరుగులేదనుకున్న కిషన్‌రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రాణం ఉన్నంతవరకు ఆ సెగ్మెంట్‌ను విడిచిపెట్టనని ఓపెన్‌గా చెబుతున్నా.. ఈసారి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకోలేదు. ఆయనకు సన్నిహితంగా ఉన్న వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిపోవడంతో ఓటమి భయం ఇంకా పెరిగిందని ఆ పార్టీ స్టేట్ ఆఫీసులో చర్చ జరుగుతున్నది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని, అందువల్లనే పోటీ చేయడానికి సుముఖంగా లేరన్నది ఆ చర్చల సారాంశం. అసమ్మతివాదుల్లోని అసంతృప్తిని చల్లార్చడంలో ముందుడాల్సిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే.. పోటీ విషయంలో డైలమాలో పడ్డారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
లోక్ సభకే మొగ్గు
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి కూడా లోక్‌సభకే పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ పార్టీ పెద్దల ఆదేశానుసారం పోటీకి ఒప్పుకోక తప్పలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న లక్ష్మణ్ సైతం గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఈసారి ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేయాల్సి ఉంటుందన్న కారణాన్ని చూపి అసెంబ్లీ బరి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం లోక్‌సభకే మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూరు లాంటి కొన్ని స్థానాల నుంచి పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఆయన మాత్రం దానిపై ఓపెన్‌గా స్పందించలేదు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం అదే ఆలోచనలో ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇష్టం లేకపోయినా, గతంలో ఎన్నడూ పోటీ చేయకున్నా ఈసారి మాత్రం దరఖాస్తు చేసుకున్నారు. కొడుకును కూడా నిలబెట్టాలనుకుంటున్నందున అప్లికేషన్ దాఖలు చేయించారు. డీకే అరుణ సైతం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, ఎవరు చెప్పినా తన నిర్ణయం మారదని తేల్చి చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ఫార్ములాతో..
పార్టీలో సీనియర్లు, రాష్ట్రవ్యాప్త గుర్తింపు కలిగిన నేతలు పోటీ చేయడం ద్వారా గెలుపు సాధించొచ్చని, అది ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందని బీజేపీ అగ్రనేతల అభిప్రాయం. ఈ ఫార్ములా అమలుతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సక్సెస్ అయిందన్న భావనతో తెలంగాణలోనూ అమలు చేయాలని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. కానీ ఈ ఫార్ములా తెలంగాణ పొలిటికల్ పరిస్థితుల్లో వర్కవుట్ కాదనేది రాష్ట్ర నేతల అభిప్రాయం. అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇష్టం లేనందునే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు.. దరఖాస్తు చేసుకోలేదు. అప్లికేషన్ పెట్టుకోకుంటే అవకాశం ఉండదంటూ పార్టీ ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేసినా లెక్క చేయలేదు. హుజూరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తరఫున అప్లికేషన్ దాఖలైందే తప్ప ఆయన స్వయంగా ఎందుకు సమర్పించలేదన్నది చర్చనీయాంశమైంది.
మొదలు కాని అభ్యర్థుల ఎంపిక
సుమారు ఆరు వేల దరఖాస్తులు వచ్చాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం గొప్పలు చెప్పుకుంటున్నా ఇందులో అర్హతలు ఎంతమందికి ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పడలేదు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ఫస్ట్ లిస్టు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అగ్రనేతల ఆదేశాలను అమలు చేయాల్సిన సీనియర్ నేతలే వాటిని గాలికి వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో దరఖాస్తు చేయకుండా మౌనంగా ఉండిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.