కాంగ్రెస్‌లోనూ మైనంపల్లి, రేఖా నాయక్‌కు షాక్ తప్పదా!

by GSrikanth |
కాంగ్రెస్‌లోనూ మైనంపల్లి, రేఖా నాయక్‌కు షాక్ తప్పదా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు హస్తిన కేంద్రంగా రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల కసరత్తుపై అధిష్టానం ఫోకస్ పెట్టడంతో కీలక నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఫస్ట్ లిస్ట్ కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే కొలిక్కి వచ్చిన 70 వరకు స్థానాలలో క్యాండిడేట్లను అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. మరో వైపు కొత్తగా పార్టీలో చేరే నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ బాట పడుతుండటంతో టీకాంగ్రెస్ రాజకీయం అంతా ఓవర్ టు ఢిల్లీ అన్నట్లుగా సాగుతోంది. బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతున్న మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్ ఫ్యామిలీపైనా ఉదయ్ పూర్ తీర్మానం ఝలక్ తప్పదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీకి చేరిన రాజకీయం..

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో చేరిక జోష్ కనిపిస్తోంది. గులాబీ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, తనతో పాటు తన కుమారుడికి టికెట్ ఆశించిన మైనంపల్లి హనుమంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వంటివారు కాంగ్రెస్‌లో చేరికపై చర్చల కోసం ఢిల్లీకి చేరుకుంటున్నారు. వీరిలో మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్‌లు తమ కుటుంబానికి రెండేసి టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో వీరి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో రేఖానాయక్, మైనంపల్లిల చేరిక వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్నది. ముఖ్యంగా తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంతోనే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మైనంపల్లికి కాంగ్రెస్‌లోనూ రెండు టికెట్లు రావని తెలిస్తే పరిస్థితి ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారుతున్నది.

‘ఉదయ్‌పూర్’ కల్లోలం..

కుటుంబానికి ఒక్కటే టికెట్ ఇవ్వాలనే ఉదయ్‌పూర్ తీర్మానంపై టీ కాంగ్రెస్‌లో ఇప్పటికే రచ్చ కొనసాగుతున్నది. ఈ విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ సీనియర్ల వర్గం మధ్య ఘాటుగా మాటల యుద్ధం నడిచిందనే ప్రచారం గతంలో వినిపించింది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అంశం తెరమీదకు తీసుకురావడంతో ఈ విషయంలో ఉత్తమ్ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీలో కనీసం ఐదేళ్లు పని చేసిన వారికి రెండో టికెట్‌కు అభ్యంతరం లేదనే వాదనతో ఉత్తమ్ సైలెంట్ అయ్యారనే ప్రచారం జరిగింది. తాజాగా మైనంపల్లి ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం వేళ మరోసారి రెండు టికెట్ల పంచాయతీ తెరమీదకు వస్తోంది. దీంతో మైనంపల్లి, రేఖానాయక్ ఫ్యామిలీపై ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతున్నది సస్పెన్స్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed