మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి.. దరువు ఎల్లన్న కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి.. దరువు ఎల్లన్న కీలక వ్యాఖ్యలు
X

దిశ, సిరిసిల్ల: ‘త్యాగాలు మావి.. బోగాలి మీవా’ అంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలను తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు దరువు ఎల్లన్న ప్రశ్నించారు. ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పార్టీలో రెండు ఏళ్లు కష్టపడితే ఎన్నికల సమయంలో పక్కకు పెట్టారని, తనకు అన్యాయం జరిగినందుకే బీజేపీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నక్కజిత్తుల వేషాలు వేస్తూ, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు అన్యాయం చేశారని, డబ్బులు ఉన్నవాళ్లకు మాత్రమే టిక్కెట్లు అంటగడుతున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు తరుపున తనకు అన్యాయం జరిగిందని తెలిపారు. విద్యార్థి అమరవీరుల త్యాగాల సాక్షిగా, తెలంగాణ ఉద్యమంలో జీవితాలు పణంగా పెట్టి, జైలుకు వెళ్లిన విద్యార్థి నాయకులను ఎన్నికల వరకు వాడుకొని ఎన్నికల్లో వారికి టికెట్టు ఇవ్వకుండా అన్యాయం చేశారని దుయ్యబట్టారు.

రెండు పార్టీల్లో చాలా మంది విద్యార్థి నాయకులు ఉన్నారని, 119 నియోజకవర్గాల్లో ఒక్క విద్యార్థి నాయకునికి టికెట్టు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను ఇచ్చినమని ఒకరు.. మద్దతు ఇచ్చినమని మరొకరు.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రెండు పార్టీలు తెలంగాణను ఆగం పట్టించారని విమర్శించారు. ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులంతా ఏకమై ప్రజాక్షేత్రంలో మరో ఉద్యమం వైపు తెర తీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నమ్మకం లేని పార్టీలను పక్కన పెట్టి, ఉద్యమ పార్టీలకు మద్దతిస్తామని చెప్పారు. తెలంగాణను మనమే కాపాడుకుందామని, మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయన్నారు. ఢిల్లీలో ఉన్న అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణను సాధించామని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న విద్యార్థి నాయకులు ఆలోచించి, ఉద్యమ పార్టీలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed