Seki Agreement: జగన్‌కు అదానీ ముడుపుల వ్యవహారం.. సంచలన విషయాలు చెప్పిన బాలినేని

by Rani Yarlagadda |
Seki Agreement: జగన్‌కు అదానీ ముడుపుల వ్యవహారం.. సంచలన విషయాలు చెప్పిన బాలినేని
X

దిశ, వెబ్ డెస్క్: జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారం ముదురుతోంది. సంచలనం రేపుతున్న సౌరవిద్యుత్‌ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasareddy) కీలక విషయాలను వెల్లడించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇంధనశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. తన ప్రమేయం లేకుండానే సెకితో ఒప్పందం జరిగిపోయిందన్నారు. అర్థరాత్రి 1 గంటకు లేపి తనను సంతకం చేయమని అడిగారని, అంత పెద్ద ఒప్పందం గురించి తనతో చర్చించకుండా సంతకం చేయమన్నారంటే.. ఏదో మతలబు ఉందనే తాను సంతకం చేయలేదన్నారు. ఒప్పందం వివరాలు పూర్తిగా తెలియకుండా సంతకం ఎలా చేస్తారని తన పీఎస్ అంతకుముందే అప్రమత్తం చేశాడని చెప్పారు. కాసేపటి తర్వాత ఇంధనశాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌.. తన అదనపు పీఎస్‌కు ఫోన్‌ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పారని, ఆ తర్వాతి రోజు ఆ ఒప్పందాన్ని కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. సెకి ఒప్పందంపై అంత గూడుపుఠాణీ ఉందని తనకు తెలియలేదని వ్యాఖ్యానించారు.

శ్రీకాంత్ చెప్పినట్లే కేబినెట్ ముందుకు ఆ ఒప్పంద పత్రాలను తీసుకెళ్లానని, మంత్రిమండలిలో దానిని ఆమోదింప చేసుకున్నారని వివరించారు. ఒప్పందం పై ఎక్కడా తాను ఒక్క సంతకం కూడా చేయలేదన్న బాలినేని.. అంతా ఒక పెద్ద మంత్రి నడిపించారన్నారు. అడపాదడపా శ్రీకాంత్‌ వచ్చి సెకితో ఒప్పందం అని చర్చించేవారని పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదన్నారు. అలాంటి ఒప్పందం గురించి ప్రభుత్వ పెద్దలు తనకెందుకు చెబుతారని బాలినేని పెదవి విరిచారు.

ఏంటి ఆ ఒప్పందం

గత ప్రభుత్వం 25 సంవత్సరాల పాటు రూ.1,05,825 కోట్ల విలువైన 7000ల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రానికి వచ్చే లాభ, నష్టాలు బేరీజు వేయకుండానే స్వలాభం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సెకీతో ఒప్పందానికి ముందు జగన్ సర్కార్ ఎవ్వరితోనూ ఏమీ చర్చించలేదని, ఎలాంటి కసరత్తు చేయలేదని స్పష్టమవుతోంది. ''జగన్‌ కోసం- జగన్‌ వల్ల - జగన్‌ చేత'' అన్నట్టుగా పూర్తిగా ఆయన కనుసన్నల్లో, మంత్రిమండలిలో నంబర్ 2గా వ్యవహరించిన 'పెద్ద మంత్రి' మార్గదర్శకత్వంలో ఒప్పందం జరిగినట్లు సమాచారం. సెకితో కరెంట్ కొనుగోలు ఒప్పందంపై 2021 నవంబర్ 7న అప్పటి ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. సెకితో ఒప్పందంపై అప్పటికే వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై వివరణ ఇస్తూ ఒప్పందాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. సెకి నుంచి విద్యుత్‌ తీసుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనన్న ఆయన సర్కార్ ఆదేశాల్నే తాము అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్టీపీసీ నుంచి యూనిట్‌ కరెంట్ రూ.1.99 చొప్పున కొనేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తనకు తెలీదని చెప్పారు. సెకి ప్రతిపాదించిన ధర ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని శ్రీకాంత్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed