పది నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు.. సర్దిచెప్పేందుకు రంగంలోకి ఆ ఇద్దరు!

by GSrikanth |
పది నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు.. సర్దిచెప్పేందుకు రంగంలోకి ఆ ఇద్దరు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆశించిన విధంగా టికెట్ రాకపోవడంతో రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారికి బుజ్జగింపులు మొదలయ్యాయి. అధికారిక అభ్యర్థి ఓట్లలో చీలిక రాకుండా ఆయా పార్టీల నాయకత్వం రంగంలోకి దిగింది. అన్ని పార్టీలకంటే ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించి రెబల్‌గా పోటీలో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నది. బీజేపీలో మాత్రం సింగిల్ డిజిట్ స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సైతం పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపు (బుధవారం) గడువు ముగుస్తుండడంతో వారి చేత ఆ నామినేషన్లను విత్‌డ్రా చేయించుకునేందుకు ఏఐసీసీ నుంచి కార్యదర్శి విష్ణునాధ్‌తో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే రంగంలోకి దిగారు.

రాష్ట్రంలో దాదాపు పది నియోజకవర్గాల్లో అసంతృప్తి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పీసీసీ గుర్తించింది. వీరిని పోటీ నుంచి తప్పించేలా నేరుగా వారితోనే సంప్రదింపులను వీరిద్దరూ మొదలుపెట్టారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బరి నుంచి వారిని తప్పుకునేలా కన్విన్స్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. నామినేషన్లు రిజెక్ట్ అయినా, ఉపసంహరించుకున్నా వారి ద్వారా నియోజకవర్గంలో ఓట్లు దూరం కాకుండా, చీలిక రాకుండా ముందుజాగ్రత్త చర్యలు మొదలయ్యాయి. కొద్దిమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తుంటే మరికొందరు ఫార్వార్డ్ బ్లాక్ లాంటి పార్టీ టికెట్ తరఫున పోటీచేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ గుర్తించిన పది నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులుగా బరిలో ఉన్నవారు వీరే :

సూర్యాపేట : పటేల్ రమేశ్ రెడ్డి

ఆదిలాబాద్ : సంజీవ్ రెడ్డి

బోత్ : వెన్నెల అశోక్, నరేష్ జాదవ్ (రిజెక్ట్)

వరంగల్ వెస్ట్ : జంగా రాఘవ రెడ్డి

నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్

ఇబ్రహీంపట్నం : దండెం రాంరెడ్డి

దోర్నకల్ : నెహ్రు నాయక్ (రిజెక్ట్)

పాలకుర్తి : జంగా రాఘవరెడ్డి (రిజెక్ట్), బండి సుధాకర్ గౌడ్ (రిజెక్ట్)

జుక్కల్ : సౌదాగర్ గంగారం

బాన్సువాడ : కాసుల బాలరాజు

బీజేపీ తరపున షాద్‌నగర్ నుంచి అధికారిక అభ్యర్థిగా అందె బాబయ్య పోటీచేస్తూ ఉంటే అక్కడి నుంచి టికెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీచేస్తున్నారు. బీజేపీ నాయకత్వం ఓట్ల చీలిక కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనేది ఆసక్తికరం.

Advertisement

Next Story