అక్కడ బావ - ఇక్కడ బామ్మర్ది.. మైనంపల్లికి షాక్ తప్పదా?

by GSrikanth |
అక్కడ బావ - ఇక్కడ బామ్మర్ది.. మైనంపల్లికి షాక్ తప్పదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల్లో (మెదక్, మల్కాజ్‌గిరి) విజయకేతనం ఎగురవేసి సత్తా చాటుతానని మైనంపల్లి బీఆర్‌ఎస్‌కు సవాలు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ అధిష్టానం అలర్టయింది. మైనంపల్లి కట్టడికి వ్యూహరచన చేస్తుంది. మంత్రి కేటీఆర్‌కు మల్కాజ్‌గిరి బాధ్యతలు, మంత్రి హరీశ్‌రావుకు మెదక్ సెగ్మెంట్ డ్యూటీ వేసినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాలు వీరివురికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అంతేకాదు రాజకీయంగానూ కీలకమే.

మరో నేత నోరెత్తకుండా..

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని పలువురు అభ్యర్థులతో పాటు పార్టీ పరిస్థితిపై కేటీఆర్ సర్వేలను ముమ్మరం చేశారు. అదే విధంగా మెదక్‌లో మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణులను ఇప్పటికే అలర్ట్ చేశారు. రెండు స్థానాల్లో ఆయనతో ఉన్న కీలక అనుచరులు, నాయకులు, కేడర్‌పై ప్రత్యేక దృష్టిసారించారు. వారందరూ పార్టీ వీడకుండా సంప్రదింపులు సైతం స్టార్ట్ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్‌లో లబ్దిపొందిన వారి వివరాలను సైతం సేకరిస్తున్నారు. వారి ఆర్థిక లావాదేవీలను సైతం తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ మైనంపల్లిని రాజకీయంగా ఎదుర్కోకపోతే రాబోయే కాలంలో అసమ్మతి నేతలు సైతం విమర్శలు చేసే అవకాశం ఉందని, ఇప్పుడు కట్టడిచేస్తేనే భవిష్యత్‌లో మరో నేత మాట్లాడాలంటేనే జంకే పరిస్థితిని తెచ్చే చర్యలు చేపడుతున్నారు. అందుకోసం కేటీఆర్, హరీశ్‌రావులు వ్యూహాల రచనలో నిమగ్నమైనట్లు సమాచారం.

భవిష్యత్‌ భరోసాకు హామీలు..

మైనంపల్లి అనుచరులు మరికొన్ని నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు. హనుమంతరావు రాజీనామాతో ఆ నియోజకవర్గాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎలాంటి ప్రభావం చూడకుండా బీఆర్ఎస్ చర్యలు చేపడుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో మైనంపల్లి అనుచరులు పార్టీని వీడితే నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం నేతల కట్టడికి చర్యలు చేపట్టడంతో పాటు కీలక నేతల భవిష్యత్‌కు బీఆర్ఎస్ భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మైనంపల్లిని రాజకీయంగా దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ అందివచ్చిన ప్రతీ అంశాన్ని అస్త్రంగా వాడుకోవాలని భావిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed