‘కర్ణాటకలో విఫలమయ్యారు.. ఇప్పుడు తెలంగాణకు వచ్చారు’

by GSrikanth |
‘కర్ణాటకలో విఫలమయ్యారు.. ఇప్పుడు తెలంగాణకు వచ్చారు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్నాటకలో ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, అక్కడ ఆర్భాటంగా ప్రకటించిన ఐదు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ విమర్శలు చేశారు. అమలుసాధ్యం కాని హామీలు, మోసపూరిత మాటలతో అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన ఫైరయ్యారు. నో డెవలప్ మెంట్, నో గవర్నెన్స్ కర్ణాటక మోడల్ అంటూ విమర్శలు చేశారు. ఇక్కడ ఆరు గ్యారెంటీలంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ చెప్పిన గ్యారెంటీలు, పనులకు నాలుగు నెలల్లో కనీసం పదిశాతం నిధులు విడుదల చేయలేదని, అన్నభాగ్య పథకం కింద పదికిలోల బియ్యం అని చెప్పి కనీసం 5 కిలోలైనా ఇవ్వడంలేదని విరుచుకుపడ్డారు. శక్తి ప్రోగ్రామ్ కింద మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణమని చెప్పి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. నిత్యం 84 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే.. కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. బస్సుల తగ్గింపుతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కర్ణాటకలో నెలకొందని పేర్కొన్నారు. కర్ణాటక మోడల్ అని ఇక్కడ చెప్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పవర్ సర్ ప్లస్ స్టేట్‌లో విద్యుత్ కొరత నెలకొందని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ ఫైరయ్యారు.

Advertisement

Next Story