సీపీఎం రెండో సీటుపై ప్రతిష్టంభన.. ఇంకా నిర్ణయం తీసుకోని కాంగ్రెస్

by GSrikanth |
సీపీఎం రెండో సీటుపై ప్రతిష్టంభన.. ఇంకా నిర్ణయం తీసుకోని కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వామపక్ష పార్టీల్లో సీపీఐతో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినా.. సీపీఎంకు కేటాయించే రెండు సీట్ల విషయంలో మాత్రం కథ మొదటికొచ్చింది. ఆ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు చేసిన ప్రతిపాదనల సంగతి ఎలా ఉన్నా, చివరికి చెరో రెండు సీట్లు కేటాయించాలన్న అంశంపై ఏకాభిప్రాయం కుదిరింది. అందులో భాగంగా సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు దాదాపుగా ఖరారయ్యాయి. ఇరు వైపుల నుంచీ ఏకాభిప్రాయం వ్యక్తం కావడంతో వివాదం లేకుండా సద్దుమణిగింది. కానీ సీపీఎం విషయంలో మాత్రం స్థానాల కేటాయింపులో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. రెండు సీట్లు తీసుకోడానికి సీపీఎం నేతలు సమ్మతించినా.. కేటాయించే స్థానాల విషయంలోనే పేచీ వస్తున్నది.

సీపీఎం ఖమ్మం జిల్లాలో ఒక సెగ్మెంట్‌ను, అలాగే నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ స్థానాన్ని కోరుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలపై స్పష్టతకు రావడంతో సీపీఎంకు కేటాయించడం కష్టమనే అభిప్రాయంతో ఉన్నది. ఇదే విషయాన్ని సీపీఎం రాష్ట్ర నేతలకూ వివరించింది. కానీ కచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఒకటి ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నది. దీంతో ఏఐసీసీ నాయకులు చేసేదేమీ లేక సీపీఎం జాతీయ నాయకులతో మాట్లాడి కన్విన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 25న ఢిల్లీలో జరిగే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో చర్చించుకున్న తర్వాత సీపీఎంకు కేటాయించే స్థానంపై క్లారిటీ రానున్నది.

మిర్యాలగూడ స్థానాన్ని తీసుకోడానికి సీపీఎం అంగీకరించినా.. సునీల్ కనుగోలు టీమ్ చేసిన సర్వేలో కాంగ్రెస్‌కు అక్కడ విజయావకాశాలు ఉన్నాయని తేలడంతో లోకల్ లీడర్లు ఇప్పుడు ఆ స్థానం కోసం పట్టుబడుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమనే సంకేతాలు రావడంతో ఇప్పుడు ఆయన అనుచరులు కాంగ్రెస్ రాష్ట్ర, కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. మిర్యాలగూడ స్థానాన్ని లక్ష్మారెడ్డికే ఇవ్వాలని, పొత్తులో భాగంగా సీపీఎంకు ఇవ్వొద్దన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. దీంతో ఈ స్థానాన్ని ఉంచుకోవడమా?.. లేక తొలుత అనుకున్నట్లుగా సీపీఎంకు కేటాయించడమా? అనే కొత్త చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది.

సీపీఐకి కేటాయించిన రెండు స్థానాల విషయంలో ఎలాంటి వివాదం లేకపోయినా.. సీపీఎంకు ఇవ్వాల్సిన రెండు స్థానాల విషయంలోనే వ్యవహరాం మొదటికొచ్చింది. అయితే సీపీఎం రాష్ట్ర స్థాయి నాయకులతో ఉత్తమ్ మరింత లోతుగా చర్చలు జరిపి, తాజా పరిస్థితిని ఏఐసీసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళనున్నారు. ఈ నెల 25న జరిగే సమావేశం తర్వాత సీపీఎంకు కేటాయించనున్న స్థానాలపై స్పష్టత రానున్నది. సీపీఎం జాతీయ నాయకత్వం రెండు స్థానాల విషయంలో రాష్ట్ర నాయకత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపనున్నదీ, ఏ తీరులో కన్విన్స్ చేయనున్నదనేది నాలుగైదు రోజుల్లో తేలనున్నది. అప్పటివరకూ సీపీఎంకు కేటాయించే రెండు స్థానాలపై ప్రతిష్టంభన కొనసాగనున్నది.

Advertisement

Next Story