కమ్యూనిస్టులకు సీఎం కేసీఆర్ స్పెషల్ రిక్వెస్ట్

by GSrikanth |
కమ్యూనిస్టులకు సీఎం కేసీఆర్ స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిస్టు నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమ‌ర్తి లింగ‌య్యకు క‌మ్యూనిస్టు సోద‌రులంతా మ‌ద్దతు ఇవ్వాల‌ని కోరారు. ఇందిర‌మ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగ‌ల రాజ్యం అని విమర్శలు చేశారు. ఎవ‌రి చేతిలో అధికారం ఉంటే రాష్ట్రం బాగుపడుతదో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నకిరేకల్ నియోజకవర్గంలో న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు. ఆ రోజుల్లో నాకు నర్రా రాఘవరెడ్డి ఎండిపోయిన వ‌రి కంకులు, కరెంట్ కోసం రోధిస్తున్న రైతుల బాధలు చూపించేవాడని అన్నారు.

‘నర్రా రాఘవరెడ్డి లాంటి మ‌హానాయ‌కుడు ఈ గ‌డ్డ మీద పుట్టారు. అందుకే ప్రత్యేకంగా క‌మ్యూనిస్టు సోద‌రుల‌కు మ‌న‌వి చేస్తున్నా. ఇక్కడ మీరు పోటీలో లేరు. మీ ఓట్లు ఎవ‌రికో ఓటు వేసి మోరిలో ప‌డేయ‌కండి. ఒక ప్రగ‌తికాముక‌మైన బీఆర్ఎస్ పార్టీకి ద‌య‌చేసి వేయండి. లింగ‌య్యకు మ‌ద్దతు ఇవ్వాల‌ని కోరుతున్నా. లింగ‌య్య ప్రజ‌ల్లో ఉండే మ‌నిషి. ఆయ‌న వ్యక్తిగ‌త ప‌నులు ఏ రోజు అడ‌గ‌లేదు. కాల్వలు, అయిటిపాముల ఎత్తిపోత‌ల‌, బ్రాహ్మణ వెల్లెంల‌, హాస్పిట‌ళ్ల గురించి అడిగిండు. ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండే వ్యక్తి, బ్రహ్మాండంగా గెలిపించండి. ఇది వెనుక‌బ‌డ్డ ప్రాంతం కాబ‌ట్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story